ఉమ్మడి విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న స్థానాల్లో శృంగవరపుకోట కూడా ఒకటి. ఈ ఎస్ కోట టిడిపికి కంచుకోట అనే చెప్పాలి. టిడిపి ఆవిర్భావం నుంచి ఇక్కడ సత్తా చాటుతుంది. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టిడిపి వరుసగా గెలిచింది..ఇక 2004లోనే ఓడిపోయింది. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది.
అయితే గత ఎన్నికల్లో కూడా టిడిపికి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోళ్ళ లలితకుమారిపై కాస్త వ్యతిరేకత, వైసీపీ గాలి వల్ల వైసీపీ నుంచి కడుబండి శ్రీనివాసరావు 11 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఈ నాలుగేళ్లలో అత్యధికంగా ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యేగా శ్రీను నిలిచారు. ఈయన పెద్దగా ప్రజల్లో ఉండరనే విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి చేయరు..ప్రజా సమస్యలు పట్టించుకోరు..దీంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఎక్కువ ఉంది.

పైగా సొంత పార్టీ వాళ్ళు సైతం ఎమ్మెల్యేని వ్యతిరేకించే పరిస్తితి. ఇటీవల నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు.. విశాఖ వెళ్లి వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కలిసి తమకు ఎమ్మెల్యే వద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని, లేదంటే తాము సహకరించబోమని తేల్చి చెప్పేశారు. అలాగే ఎమ్మెల్యే పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇలా సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే పరిస్తితి దారుణంగా ఉంది. ఈ క్రమంలో టిడిపి వేగంగా పుంజుకుంటుంది. టిడిపి నాయకురాలు లలితకుమారి పికప్ అయ్యారు. ఈ సారి ఎస్ కోటలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పవచ్చు.
