అధికార వైసీపీలో రచ్చ మామూలుగా జరగడం లేదు. ఎక్కడకక్కడ సొంత పార్టీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు….వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అసలు ప్రతిపక్ష టీడీపీకి పెద్ద అవకాశం ఇవ్వకుండా, వారే విమర్శలు చేసేస్తున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి నడుస్తోంది. ఇటీవలే ఒంగోలులో సుబ్బారావు అనే వ్యక్తి సొంత పార్టీ చేసే తప్పులని ఎత్తి చూపిన విషయం తెలిసిందే. అలా మాట్లాడినందుకు ఆయనని ఏం చేశారో అందరికీ తెలిసిందే.

ఇక తర్వాత చిలకలూరిపేటలో సీనియర్ నేత మర్రి రాజశేఖర్ సోదరుడు సైతం….వైసీపీపై విమర్శలు చేశారు. ఇటు వస్తే పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అసలు ప్రజలకు ఒక్క పని కూడా చేయడం లేదని..ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాట్లాడుతున్నారు. ప్రతి పనికీ రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారని, చివరకు తిరుమల శ్రీవారి దర్శనం సిఫారసు లేఖలను కూడా అమ్ముకుంటున్నారని ఎస్.రాయవరం మండలం వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. దళిత ఎమ్మెల్యే అయిఉండి దళితులను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

అటు టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు గళంవిప్పారు. 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండా ఎగరాలంటే.. ఇన్‌చార్జి బాధ్యతల నుంచి దువ్వాడను తప్పించి.. వేరొకరికి అప్పగించాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు…లేదంటే తాము పార్టీని వదిలిపోతామని టెక్కలి వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీడీపీలో పదవులు పొందినవారిని నేడు అనుచరులుగా తిప్పుకొంటూ పార్టీని భ్రష్టు పట్టించారని, ఇదే కొనసాగితే వైసీపీ కేడర్‌కు మనుగడ ఉండదని అన్నారు.

టెక్కలిలో ఇలా ఉంటే చిత్తూరులోని తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి వ్యతిరేకంగా తంబళ్లపల్లె జడ్పీటీసీ సభ్యురాలు మద్దిరెడ్డి గీత భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తంబళ్ళపల్లెలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇలా ఆరోపణలు చేసిన వెంటనే..ఎప్పుడో పాత కేసుల్లో కొండ్రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడకక్కడే వైసీపీలో రచ్చ నడుస్తోంది.

Discussion about this post