వైసీపీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్ళు అవుతుంది. అయితే ఈ రెండున్నర ఏళ్లలో ప్రజల్లో మార్పు వచ్చిందా? వైసీపీపై వ్యతిరేకత కనబడుతుందా? అంటే పైకి కనిపించకపోయినా, లోలోపల వ్యతిరేకత బాగానే ఉందని కనిపిస్తోంది. కానీ ఆ వ్యతిరేకతని కనిపించకుండా వైసీపీ అధికార బలంతో కవర్ చేసేస్తుందనే చర్చలు కూడా నడుస్తున్నాయి. వైసీపీ బలం తగ్గిందో లేదో తెలియడానికి స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం…ఏడు నెలల క్రితం జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్‌గా గెలిచేసింది. అది కూడా అలాంటి ఇలాంటి విజయాలు కాదు…ఏకంగా 80 శాతం, 90 శాతం, 100 శాతం స్థానాలని కైవసం చేసుకునే రేంజ్‌లో.

అయితే ఈ విజయాలు కాస్త ప్రజల మద్ధతు, ఇంకాస్త అధికార బలంతో దక్కాయని చెప్పొచ్చు. కానీ ఏడు నెలల తర్వాత జరిగిన మినీ మున్సిపాలిటీ ఎన్నికలు అంటే…తాజాగా 12 మున్సిపాలిటీలు, నెల్లూరు నగర కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. కానీ ఈ సారి జరిగిన ఎన్నికల్లో కాస్త పోటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది.

అసలు నామినేషన్లు వేయడానికి భయపడిన కొన్ని స్థానాల్లో, నామినేషన్లు వేయడమే కాకుండా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఉదాహరణకు దాచేపల్లి మున్సిపాలిటీ..అసలు ఇక్కడ టీడీపీకి నామినేషన్లు వేయడమే కష్టమైంది. చివరికి హైకోర్టు డైరక్షన్ తెచ్చుకుని, నామినేషన్లు వేశారు. ఇక 20 వార్డుల్లో వైసీపీ ఒక వార్డుని ఏకగ్రీవం చేసేసుకుంది…దీంతో 19 వార్డుల్లో పోటీ జరిగింది. 19 వార్డుల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా టీడీపీ 7, జనసేన 1, ఇండిపెండెంట్ ఒక చోట గెలిచారు.

వైసీపీ 11 వార్డుల్లో గెలిచి…ఎడ్జ్‌లో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అసలు రెండు, మూడు వార్డుల్లో రీకౌంటింగ్ చేసి వైసీపీ రిజల్ట్ తారుమారు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కానీ మొత్తం మీద టీడీపీ, వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఇక గుంటూరు కార్పొరేషన్ 6వ డివిజన్‌కు ఉపఎన్నిక జరిగింది…వైసీపీ అభ్యర్ధి చనిపోవడంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది.

ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో దాదాపు వెయ్యి ఓట్ల మెజారిటీతో అక్కడ వైసీపీ అభ్యర్ధి గెలిచారు. ఆయనే రాబోయే రెండున్నర ఏళ్లలో గుంటూరు మేయర్ కూడా. ఇక అక్కడ ఉపఎన్నికలో ఇప్పుడు టీడీపీ దాదాపు 600 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే ఏడు నెలల్లో ఏం మార్పు వచ్చిందో అర్ధమవుతుంది. మొత్తానికైతే ఫ్యాన్ స్పీడుని సైకిల్ తగ్గిస్తున్నట్లే కనిపిస్తోంది.

Discussion about this post