నారా లోకేష్ పాదయాత్ర చేస్తూనే..పలు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే..టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని దాదాపు ఖరారు చేశారు. అయితే ఇదే క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ టిడిపి నేతకు సీటు ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కుప్పం స్థానంలో చంద్రబాబు పోటీ ఖాయం.

ఇక పలమనేరులో అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించారు. నగరిలో గాలి భాను ప్రకాష్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్, సత్యవేడులో హెలెన్, చంద్రగిరిలో పులివర్తి నాని, పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించారు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్ పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అక్కడ టిడిపి నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయడం ఖాయమని లోకేష్ ప్రకటించారు. దీంతో పీలేరులో సీటు ఫిక్స్ అయింది.
అయితే గత ఎన్నికల్లోనే కిషోర్ టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే 2014లో తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇలా వరుసగా కిషోర్ పీలేరు బరిలో ఓడిపోయారు. కానీ ఈ సారి గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది..అలాగే పీలేరులో టిడిపి బలం పెరిగింది.

అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిపై వ్యతిరేకత కనిపిస్తుంది..వరుసగా రెండుసార్లు ఆయన అక్కడ గెలుస్తూ వస్తున్నారు. అయితే రెండుసార్లు గెలిచిన పెద్దగా అభివృద్ది చేయలేదు..అటు అక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీలేరులో వైసీపీ ఎమ్మెల్యేకు మళ్ళీ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ సారి నల్లారి కిషోర్ తొలి విజయం దక్కించుకునేలా ఉన్నారు.