ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం..గత ఎన్నికల్లో పెద్ద హాట్ టాపిక్ అయిన స్థానం. ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవన్ పోటీ చేశారు. భీమవరంతో పాటు గాజువాకలో పోటీ చేశారు. అందుకే ఆ సీటు గురించి పెద్ద చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా పవన్ రెండుచోట్ల ఓటమి పాలైన విషయం తెలిసిందే. వైసీపీ గెలిచింది. గాజువాకలో వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి గెలిచారు.
వైసీపీలో అతి త్వరగా ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యే ఈయనే. ఇక్కడ వైసీపీ బలం దారుణంగా తగ్గింది. జనసేన, టిడిపి బలం పెరిగాయి. అయితే టిడిపి, జనసేన పొత్తులో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో గాజువాకలో వైసీపీ ఓడిపోవడం ఖాయమే. ఎందుకంటే గత ఎన్నికల్లో గాజువాకలో వైసీపీకి దాదాపు 74 వేల ఓట్లు పడితే..జనసేనకు 56 వేలు, టిడిపికి 54 వేలు పడ్డాయి. అంటే ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే లక్షా 10 వేలు..వైసీపీ కంటే 36 వేలు ఎక్కువ.

ఇది గత ఎన్నికల్లో..ఇప్పుడు వైసీపీ పరిస్తితి దిగజారింది. అలాంటప్పుడు ఇక్కడ టిడిపి, జనసేనల్లో ఎవరు పోటీ చేసిన భారీ మెజారిటీ ఖాయమే. కాకపోతే పొత్తులో భాగంగా ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. పవన్ పోటీ చేస్తే వేరే ఆప్షన్ ఉండదు. కానీ ఆయన భీమవరంలో పోటీ చేయవచ్చు.
ఇదే సమయంలో టిడిపి నుంచి పల్లా శ్రీనివాసరావు బరిలో దిగే ఛాన్స్ ఉంది. పల్లాకు గాజువాకపై మంచి పట్టు ఉంది. విశాఖలో మరొక సీటు ఏదైనా జనసేనకు కేటాయించి గాజువాక సీటు టిడిపి తీసుకోవచ్చు. పల్లా పోటీ చేస్తే భారీ మెజారిటీ ఖాయమనే అంటున్నారు. ఆయనకు సొంత ఇమేజ్ కూడా కలిసొస్తుంది. చూడాలి మరి గాజువాక సీటు ఎవరికి దక్కుతుందో.