తెలుగుదేశం పార్టీని వరుసగా విషాదాలు వెంటపడుతున్నాయి. టిడిపికి చెందిన కీలక నేతలు గుండెపోటుతో మరణించడం.ఆ పార్టీకి తీరని లోటుగా మిగిలిపోతుంది. ఇప్పుడుప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి తారకరత్న..గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పార్టీకి సపోర్ట్ గా తిరుగుతున్న సమయంలోనే తారకరత్న మరణించడం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇక తారకరత్న తర్వాత టిడిపి సీనియర్ నేత, బచ్చుల అర్జునుడు సైతం గుండెపోటుతో మరణించారు.
అనేక ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న అర్జునుడు గన్నవరం టిడిపి ఇంచార్జ్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మరణించారు. ఇక అనూహ్యంగా 47 ఏళ్ల వయసులో వరుపుల రాజా గుండెపోటుతో మరణించడం టిడిపికి పెద్ద లోట్టు అనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి పొటి చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయిన రాజా..తర్వాత పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ప్రత్తిపాడులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపిని గెలిపించడం కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో తిరిగి..రాత్రి కార్యకర్తలతో మాట్లాడుతూ హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది.
ఇలా వరుసగా టిడిపి కీలక నేతలు మరణించారు. అర్జునుడు మరణించడంతో గన్నవరంలో, రాజా మరణించడంతో ప్రత్తిపాడులో టిడిపి కొత్త అభ్యర్ధుల్ని వెతుక్కోవాల్సిన పని పడింది. రెండు నియోజకవర్గాల్లో కొత్త నాయకులని పెట్టాల్సి ఉంది. అయితే ప్రత్తిపాడులో రాజాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అలాంటి నేత లేకపోవడం టిడిపికి పెద్ద లోటు. చూడాలి మరి రెండు చోట్ల టిడిపికి బలమైన నాయకులు దొరుకుతారో లేదో.
