వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీ అధికార పార్టీ వైసీపీ పెట్టుకున్న టార్గెట్ 175 నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకోవడమే. గత ఎన్నికల్లో 151 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఈ దఫా మొత్తం నియోజకవర్గాల్లో ఎందుకు విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకుంది. అయితే.. ఈ లక్ష్యం చేరడం వైసీపీకి అంత సులువు కాదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చాలా వరకు నియోజకవ ర్గాల్లో పార్టీకి పట్టు ఇప్పటికీ కూడా లేదు.

పార్టీ అధికారంలో ఉందనే మాట తప్ప.. ఎక్కడా ఆదిశగా పార్టీ బలోపేతం అవుతున్న పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా ఇప్పటికీ.. నాయకులు.. పార్టీ కూడా జగన్‌పైనే ఆధారపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీక్ గా ఉన్న నియోజకవర్గాల జాబితా.. ఇప్పటికే సీఎం జగన్‌కు చేరింది. దీంతో ఆయన అలాంటి చోట్ల పార్టీని పైకి లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి.. ఆయా నియోజకవర్గాలను ఎంచుకుంటు న్నారు.

అంటే.. తనే స్వయంగా ఆయా నియోజకవర్గాల్లో సభలు పెడితే.. పార్టీ పుంజుకుంటుందని జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో తాజాగా వైఎస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ తొలి విడద(ఈ ఏడాది) నిధులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. గన్ని వీరాంజనేయులు.. ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తున్నారు.

ఆయన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యేనే కాకుండా… ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన పుప్పాల వాసు పనితీరుపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆయనే ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నా ఆయన వల్ల ఏలూరు జిల్లాలో కాదు కదా…కనీసం నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీకి కొత్తగా ఒరిగేది లేదని.. గత ఎన్నికల్లో కేవలం పార్టీ వేవ్‌లోనే ఆయన గట్టెక్కారన్న టాక్ అధిష్టానం దగ్గరకు వెళ్లిపోయింది.

ఇప్పుడే ఇక్కడ వైసీపీ పరిస్థితి అంతంత మాత్రం అయిపోయింది. రేపటి రోజు పొత్తుల వ్యవహారాలు ఉంటే అసలు జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా ఉంగుటూరులో పార్టీని గెలిపించలేరు. పైగా గెలిచిన పుప్పాల వాసు నియోజకవర్గంలో అప్పుడప్పుడు.. అరుదుగా పర్యటిస్తుంటారన్న టాక్ ఉంటే..ఓడిన మాజీ ఎమ్మెల్యే గన్ని నియోజకవర్గంలో నిత్యం ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట గిరాగిరా తిరుగుతూనే ఉంటున్నారు.

ఏదో ఒక కార్యక్రమం, పని పేరుతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గన్ని దూకుడుతో వైసీపీకి ఇక్కడ చాలా వరకు చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సడెన్‌గా జగన్ సభ పెట్టడం వెనుక పార్టీని బలోపేతం చేయడమేననే చర్చ సాగుతోంది. ఇక్కడ నివేదికలు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో జగన్ సైతం స్థానిక ఎమ్మెల్యేపై అసహనంతోనే ఉన్నారని కూడా టాక్ ?

ఎంత సభ పెట్టినా కూడా జగన్ అనుకున్న విధంగా ఇక్కడ ఎలాంటి మైలేజీ రాలేదు. పైగా జగన్ ప్రసంగిస్తున్న సమయంలో కీలకమైన మహిళలే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతేకాదు.. వద్దు బాబోయ్ అంటూ.. సభకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. ఇక, సభను నిర్వహించిన స్థానిక నేతలు కూడా ప్రజలను కూర్చోబెట్టలేక పోయారు. అదే సమయంలో సమీకరించడంలో తడబడ్డారు. దీంతో జగన్ చేసిన ప్రయత్నం ఆదిలోనే వికటించిందనే వాదన వినిపించింది.

Discussion about this post