రాజకీయంగా ఎలాంటి మార్పులు జరిగినా..పార్టీలు మార్చినా, నియోజకవర్గాలు మార్చినా సరే ఓటమి మాత్రం ఆ నాయకుడుని పలకరించలేదు. వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. అలా గెలుస్తూ వస్తున్న నేత ఎవరో ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది. టిడిపిలో మొన్నటివరకు యాక్టివ్ గా లేకుండా..ఈ మధ్య యాక్టివ్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈయన ఇప్పటివరకు పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేయలేదు.

1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు..2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గా గెలిచారు. 2014లో టిడిపి నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచారు. ఇలా నియోజకవర్గాలు మారుస్తూ…విశాఖ మొత్తం రౌండ్ వేస్తూ గెలుస్తున్నారు. ఈ సారి కూడా గంటా సీటు మారడం ఖాయమని తెలుస్తోంది. మళ్ళీ ఆయన విశాఖ నార్త్ మాత్రం పోటీ చేయరని తెలుస్తోంది.

ఇదే సమయంలో మళ్ళీ భీమిలి, అనకాపల్లి, చోడవరం సీట్లలో ఏదొక చోట పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే పొత్తు ఉంటే భీమిలి సీటు జనసేనకు వెళుతుందని ప్రచారం వస్తుంది. అనకాపల్లి, చోడవరంలో టిడిపి నాయకులు ఉన్నారు. అయితే ఈ మూడు చోట్ల ఆల్రెడీ గంటా పోటీ చేశారు కాబట్టి..ఈ సారి కొత్తగా పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల బరిలో దిగుతారని ప్రచారం వస్తుంది.

అక్కడ సీటు ఖాళీగానే ఉంది. కాకపోతే ఆ సీటు కోసం పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో గంటా ఆ సీటు వైపు వెళ్తారనే ప్రచారం ఉంది. చూడాలి మరి చివరికి గంటా ఏ సీటులో పోటీ చేస్తారో.
