గత ప్రభుత్వాల్లో ఇలా బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు ఇవ్వడం లేదు..మనమే బాగా బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ప్రజలంతా మనవైపే ఉంటారు. మనం ఎంత బాగా బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నామో ప్రజలు తెలియచేయాలి..అలాగే ప్రజల మద్ధతు పొందాలి అని చెప్పి జగన్..ఎప్పటికప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో చెబుతూ ఉంటారు. అంటే గత ప్రభుత్వాలు చేయలేని పని తాము చేస్తున్నామని జగన్ పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.

తాజాగా వైసీపీ ఎమ్మెల్యేతో జరిగిన వర్క్ షాపులో కూడా అదే తరహాలో మాట్లాడారు. మొదట కొందరు మంత్రులతో సహ 20 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడంలో విఫలమవుతున్నారని, వారు ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని జగన్ హితబోధ చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలూ గెలిచే దిశగా వైసీపీ ఎమ్మెల్యేలందరూ రెండు నెలల పాటు ప్రజల్లోనే తిరగాలని, ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని.. వీటిని ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. గత ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని.. గతంలో కంటే భిన్నంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ అవుతున్న విషయాన్ని జనానికి వివరించాలని చెప్పారు.

వాలంటీర్లు, సచివాలయ సమన్వయకర్తలు, గృహ సారథులని కలుపుకుని ఎమ్మెల్యేలు గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరించాలని అంటున్నారు. అంటే గత టిడిపి ప్రభుత్వ పాలన, ఇప్పుడు పాలన ఎలా ఉందో పోల్చి చెప్పాలని అంటున్నారు. అయితే అలా చెబితే ప్రజలు వైసీపీకి మద్ధతు ఇస్తారా? అంటే ఇవ్వడం సంగతి దేవుడెరుగు..ముందు వ్యతిరేకంగా తయారవ్వకపోతే మంచిందని చెప్పవచ్చు.

ఎందుకంటే గతంలో ఇచ్చిన పథకాలు ఇప్పుడు ఇస్తున్నారు. ఒకటి రెండు పథకాలు కొత్తవి అంతే. అప్పుడు ఎకౌంట్లలోనే డబ్బులు వేశారు. ఇప్పుడు అంతే. గతంలో పన్నుల బాదుడు లేదు..రోడ్లు బాగున్నాయి..పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువే..ఇసుక అందుబాటులో ఉంది..అభివృద్ధి జరిగింది, నిత్యావసర ధరలు అందుబాటులో ఉన్నాయి. కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. కొత్త కంపెనీలు తీసుకొచ్చారు. ఇంకా చాలా జరిగాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో జనాలకు తెలుసు. కాబట్టి గత పాలనతో పోల్చి చూస్తే వైసీపీకే రిస్క్.
