March 24, 2023
గిద్దలూరులో మెజారిటీని కరిగించడం కష్టమేనా?
ap news latest AP Politics

గిద్దలూరులో మెజారిటీని కరిగించడం కష్టమేనా?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో గిద్దలూరు ఒకటి అని చెప్పవచ్చు. గతంలో గిద్దలూరులో ఏ పార్టీకి అనుకున్న విధంగా ఆదరణ ఉండేది కాదు..ఒకో ఎన్నికలో ఒకో పార్టీ గెలిచేది. మొదట్లో ఇక్కడ కాస్త కాంగ్రెస్ హవా ఉండేది. ఆ తర్వాత టి‌డి‌పి సత్తా చాటింది. 1985లో టి‌డి‌పి గెలవగా, 1989లో కాంగ్రెస్, మళ్ళీ 1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది.

ఇంకా అంతే టి‌డి‌పి చివరిసారిగా గెలిచింది అప్పుడే. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచింది. 2014లో కేవలం 12 వేల ఓట్ల తేడాతో గెలిచిన వైసీపీ..2019 ఎన్నికల్లో దాదాపు 81 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఆ ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ 90 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా, ఆ తర్వాత రికార్డు మెజారిటీ గిద్దలూరులో గెలిచిన అన్నా రాంబాబుదే.

ఈయనే 2009లో ప్రజారాజ్యం గెలిచారు..2014లో టి‌డి‌పి నుంచి ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి గెలిచారు. ఇంత భారీ మెజారిటీతో గెలిచిన రాంబాబుపై ప్రజల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా పనిచేయట్లేదు. సంక్షేమ పథకాలు తప్ప..అక్కడ అభివృద్ధి తక్కువే. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు ఎక్కువగానే వచ్చాయి.

ఈ పరిస్తితులు ఎమ్మెల్యేకు నెగిటివ్ అవుతున్నాయి. ఆయనపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అటు టి‌డి‌పి నుంచి అశోక్ రెడ్డి బలపడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు వరుసగా టి‌డి‌పిలో జాయిన్ అవుతున్నారు. కానీ ఎంత చూసుకున్న 81 వేల మెజారిటీని తగ్గించడం అనేది చాలా కష్టమైన పని. అంతమంది పూర్తిగా వైసీపీని వదిలి టి‌డి‌పి వైపు చూస్తారా? అనేది డౌటే.

ఎందుకంటే గిద్దలూరులో వైసీపీని అభిమానించే వారు ఎక్కువ. ఇక వారిలో గాని మార్పు వస్తే టి‌డి‌పికి కలిసొస్తుంది. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పితో జనసేన పొత్తు ఉండే ఛాన్స్ ఉంది. గిద్దలూరులో జనసేనకు కాస్త ఓటు బ్యాంక్ ఉంది. రెండు పార్టీలు కలిస్తే వైసీపీపై పోరాడే ఛాన్స్ ఉంది.