రాజకీయాల్లో వారసులకు కొదవలేదు. అయితే.. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినా..కూడా పేరు నిలబెట్టుకునే పరిస్థితి చాలా తక్కువ మందికే ఉంటోంది. కొందరు మాత్రమే పుంజుకుంటున్నారు. మరి ఇలా.. వారసత్వంగా రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీకాకుళం జిల్లా ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. గౌతు శిరీష్ పరిస్థితి ఏంటి? ఆమె ఫ్యూచరేంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్ర సమరయోధులు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు గౌతు లచ్చన్న మనవరాలిగా, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ తనయగా రాజకీయ అరంగేట్రం చేసిన శిరీష.. దూకుడు రాజకీయాలు చేస్తున్నా.. ఆ రేంజ్‌లో అయితే.. ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకుల మధ్య చర్చకు వస్తోంది.

లచ్చన్నను తీసుకుంటే.. ఈయన బడుగు బలహీన వర్గాల కు చెందిన నాయకుడుగా పేరు తెచ్చుకు న్నారు. జనతా పార్టీ నుంచి పలుమార్లు విజయం సాధించారు. అంతేకాదు.. తాను నమ్ముకున్న సిద్ధాంతా లకు పెద్దపీట వేశారు. రాజకీయ గురువు ఎన్జీ రంగా.. రంగా గుంటూరులో ఓడిపోతే.. శ్రీకాకుళంలో తాను గెలిచినా.. ఆ పదవికి రాజీనామా చేసి, అక్కడ నుంచి రంగా ను నిలబెట్టి గెలిపించుకున్న ఘన చరిత్రను సొంతం చేసుకున్నారు. ఇక, శ్యామ్ సుందర్ శివాజీ కూడా ప్రజలకు చేరువయ్యారు. నియోజకవర్గంలోనే ఉంటూ.. పార్టీని, ప్రజలను సమవుజ్జీగా నడిపించారు. ఇంకా చెప్పాలంటే తండ్రి, కుమారులు ఇద్దరు ఏకంగా పది సార్లు అసెంబ్లీకి వెళ్లారు. ఈ పరిస్థితే.. గౌతు కుటుంబానికి ప్రజల నుంచి చెరగని ఆదరణ లభించేలా చేసింది.

మరి ఈ కుటుంబం నుంచి వారసురాలిగా వచ్చిన శిరీష ఏం చేస్తున్నారు? అంటే.. చెప్పడం కొంచెం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి శిరీషకు కూడా బలమైన వాయిస్ ఉంది. కానీ, అప్పుడప్పుడు వాయిస్ వినిపిస్తోందనే వాదన వస్తుండడం గమనార్హం. పలాస నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. పూర్తిగా మకాం విశాఖకు మార్చుకోవడం.. మరింత మైనస్‌గా మారిపోయింది. పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నా.. ప్రజలకు క్షేత్రస్థాయిలో మరింతగా చేరాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

సామాజిక సమీకరణల పరంగా తీసుకుంటే ఆమెకు చాలా చాలా ఫ్యూచర్ ఉంది. ఆమె రాష్ట్ర స్థాయిలో మరింతగా పోరాటాలు చేయాలని పలువురు కోరుతున్నారు. అదే సమయంలో పలాసలో ఉండ డం.. ఇక్కడి సమస్యలు పరిష్కరించడం.. వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజల తరఫున పోరాటం చేస్తే.. తాతకు తగ్గ మనవరాలిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఏదేమైనా శిరీష మరింతగా దూకుడు పెంచాలని అటు పార్టీ నేతలే కాదు.. ఇటు గౌతు కుటుంబ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Discussion about this post