ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పాలి. టిడిపి పెట్టిన 1983 దగ్గర నుంచి జిల్లాలో పార్టీ హవా నడుస్తోంది. ఏదో ఒకటి రెండు స్థానాల్లో మినహా మిగిలిన స్థానాలు టిడిపికి కంచుకోటలు గానే ఉన్నాయి. అలాంటి కంచుకోటల్లో తాడేపల్లిగూడెం కూడా ఒకటి. ఈ స్థానంలో టిడిపి మంచి విజయాలే సాధించింది.

1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో పార్టీ సత్తా చాటింది. 2004లో కాంగ్రెస్ గెలవగా, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. 2014లో టీడీపీతో పొత్తులో బిజేపి గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే వైసీపీకి ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ ఉంది. మంత్రి కొట్టు సత్యనారాయణకు నెగిటివ్ ఎక్కువ కనిపిస్తుంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ-జనసేనలు పోటాపోటిగా రాజకీయం చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్లే గత ఎన్నికల్లో గూడెంలో వైసీపీ గెలిచింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రానివ్వకూడదు అని అటు చంద్రబాబు, ఇటు పవన్ ఆలోచిస్తున్నారు. అందుకే పొత్తు దిశగా ఆలోచన చేస్తున్నారు.

అయితే పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకే ఇస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. దీంతో జనసేన తరుపున పోటీ చేయడానికి బొలిశెట్టి శ్రీనివాస్ రెడీ అవుతున్నారు. అదే సమయంలో ఇటీవల టిడిపి అధిష్టానం..టిడిపి ఇంచార్జ్ వలవల బాబ్జీని పోటీకి రెడీగా ఉండాలని సూచించిందని తెలిసింది. దీంతో గూడెం సీటులో కన్ఫ్యూజన్ మొదలైంది.

టిడిపి-జనసేనల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. అయితే కోల్డ్ వార్ లేకుండా ఎవరోకరు కాంప్రమైజ్ అయితే గూడెం సీటుని గెలుచుకోవచ్చు. అలా కాకుండా రెండు పార్టీలు వేరు వేరుగా ఉంటే మళ్ళీ గూడెం సీటు వైసీపీ దక్కించుకుంటుంది. చూడాలి మరి గూడెంలో టిడిపి-జనసేనల్లో సీటు ఎవరికి దక్కుతుందో.
