రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు…పరిస్తితులు మారుతాయి. అయితే అలా మారడానికి కూడా కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు. ఇప్పుడు గుడివాడలో కూడా అదే జరుగుతుందని అక్కడ న్యూట్రల్ వర్గాలు అంటున్నాయి. ఇంతకాలం నానికి గుడివాడలో తిరుగులేదనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ రెండు సార్లు ప్రతిపక్షంలోనే ఉన్నారు. దీంతో ప్రజా సమస్యలపై పోరాటాలు తప్ప, పెద్దగా పనులు చేయలేకపోయారు.

ఇక నానీని జనం కూడా అర్ధం చేసుకున్నారు. ఇక 2014 ఎన్నికల ముందు ఎమ్మెల్యే పదవికి, టిడిపికి రాజీనామా చేసి వైసీపీ చేరిపోయారు. వైసీపీలోకి వెళ్ళాక కూడా నాని ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టిడిపి గాలి ఉన్నా, గుడివాడ టిడిపి కంచుకోట అయినా సరే ప్రజలు నాని వైపు నిలబడ్డారు. అంటే నాని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ నుంచి గెలిచిన నాని మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమయ్యారు.

దీంతో మళ్ళీ గుడివాడలో పెద్దగా పనులు జరగలేదు. అప్పుడు కూడా నాని అధికారంలో లేరు కదా అని జనం లైట్ తీసుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో సుడి తిరిగింది. నాని నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచేసేయారు…అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చింది. మంత్రి కూడా అయిపోయారు. దీంతో గుడివాడలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అంతా అనుకున్నారు.

కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా పరిస్తితి ఉంది. ఏదో ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తప్ప అక్కడ కొత్తగా ఏమి జరగడం లేదు. రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. అలాగే స్థానికంగా ఉపాధి కల్పించే సంస్థలు గుడివాడకు రాలేదు. గుడివాడ టౌన్ ఇంకా అలాగే ఉంది. ఇలా గుడివాడ అభివృద్ధికి నోచుకోకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

నాని తాను ఎదగడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్పితే.. నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదని గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. గుడివాడలో రోడ్ల దుస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె కాదు చాలామంది ప్రజలు నాని పనితీరుపై అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అధికారంలో ఉన్న నాని చేసేది ఏమి లేదని జనాలకు క్లారిటీ వచ్చేసింది. గుడివాడ జనాలకు కొడాలి కారు మబ్బులు వీడుతున్నాయ్‌గా..!

Discussion about this post