వచ్చే ఎన్నికలలో లేదా.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే.. టీడీపీ తరఫున గుంటూరు జిల్లా నుంచి ఎవరు మంత్రి అవుతారు? ఎవరికి అవకాశం దక్కుతుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. సాధారణంగా.. కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న గుంటూరులో టీడీపీకి అన్ని విధాలా ముందుండి నడిపిస్తు న్నది ఈ వర్గమే. దీంతో ఆది నుంచి కూడా కమ్మ వర్గానికి ఈ జిల్లాలో మంత్రి పదవులు దక్కుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి మంత్రి పదవిని కమ్మ వర్గానికి రిజర్వ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో అన్నాబత్తుని సత్యనారాయణ, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వంటివారు ఛాన్స్ దక్కించుకున్నారు.

ఆ తర్వాత మాకినేని పెదరత్తయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కోడెల శివప్రసాద్‌లకు కూడా చంద్రబాబు గుంటూరు కోటాలో మంత్రి పదవులు ఇచ్చారు. ఇక, గత ఐదేళ్ల పాలనలోనూ కమ్మ వర్గానికి చెందిన ప్రత్తిపాటి పుల్లారావును మంత్రిని చేశారు. మరి .. వచ్చే ఎన్నికల్లో కనుక టీడీపీ విజయం దక్కించుకుంటే.. గుంటూరు కోటాలో ఎవరికి దక్కుతుంది? అనే ప్రశ్న తెరమీదికి వస్తే.. ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు.. పల్నాడు ప్రాంతానికి చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. గతంలో వరుస విజయాలు సాధించిన యరపతినేని.. గత ఎన్నికల్లో ఓడిపోయారు.

అయినప్పటికీ పార్టీ కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్‌కు, చంద్రబాబుకు కూడా అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడంతోపాటు.. సొంతగా అనేక రూపాల్లో ఇక్కడి ప్రజలకు నేనున్నానంటూ.. అభయం ఇస్తున్నారు. దీంతో ఈయనకు అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. యరపతినేని భారీ మెజారిటీతో గెలివాల్సిన టార్గెట్ ఉంది. ఇది కనుక ఆయన సాధిస్తే.. మంత్రి రేసులో ముందున్నట్టేనని అంటున్నారు. ఇక, పొన్నూరు నుంచి ఏకంగా 5 సార్లు వరుస విజయాలు దక్కించుకున్న ధూళిపాళ్ల నరేంద్ర కు కూడా అవకాశం ఉంది. అయితే.. సంగం డెయిరీ చైర్మన్‌గా ఉండడంతో ఆయనకు మంత్రిగా అవకాశం ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు ఉన్నాయి.

వాస్తవానికి గత ప్రభుత్వంలోనే నరేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నించారు. అయితే.. సంగం డెయిరీ చైర్మన్‌ను వదులుకుంటే ఇస్తానని చంద్రబాబు అప్పట్లో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ, దీనికి నరేంద్ర ఒప్పుకోలేదు. దీంతో అప్పట్లో ఆయన కోరిక నెరవేరలేదు. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నరేంద్ర గెలిస్తే.. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన సింపతీ మేరకైనా .. మంత్రి పదవిదక్కుంతుందని ఆయన అభిమానులు చెబుతుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post