తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో గుంటూరు పార్లమెంట్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలో టీడీపీకి కంచుకోట లాంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, తెనాలి సీట్లు ఉన్నాయి. వీటిల్లో పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి, గుంటూరు వెస్ట్ సీట్లు టీడీపీకి అనుకూలమైనవి.

అయితే 2014 ఎన్నికల తర్వాత పార్లమెంట్ పై టిడిపికి పట్టు పెరిగింది. కానీ 2019 ఎన్నికల్లో అక్కడ టిడిపికి భారీ షాక్ తగిలింది. ఒక్క గుంటూరు వెస్ట్ మాత్రమే టిడిపి గెలుచుకుంది. మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిని ఎలా దెబ్బతీస్తుందో తెలిసిందే. రాజధాని ప్రాంతాన్ని దెబ్బతీయడంతో అక్కడ వైసీపీకి వ్యతిరేకత పెరిగింది. టిడిపి పుంజుకుంటుంది. ఈ క్రమంలో ఈ సారి గుంటూరు పరిధిలో టిడిపి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని గమనిస్తే టీడీపీకి..తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, గుంటూరు వెస్ట్ స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తుంది.

ఇక గుంటూరు ఈస్ట్, తెనాలి, ప్రత్తిపాడు సీట్లు జనసేనతో పొత్తుపై ఆధారపడి ఉన్నాయి. పొత్తు ఉంటే ఈ మూడు సీట్లని సైతం టీడీపీ లేదా జనసేన కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే గుంటూరు పార్లమెంట్ లో వైసీపీకి ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ పొత్తు లేకపోతే మాత్రం కాస్త రాజకీయం మారే ఛాన్స్ ఉంది. ఓట్ల చీలిక వల్ల ఒకటి, రెండు సీట్లు వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. అదే పొత్తు ఉంటే గుంటూరు లో స్వీప్ ఖాయం.
