ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం అంటే టిడిపికి కంచుకోట అని చెప్పాలి. ఇక్కడ రెండుసార్లు మినహా..మిగిలిన అన్నీ సార్లు టిడిపి గెలిచింది. అయితే గత ఎన్నికల్లో వర్గ విభేదాలతో టిడిపి ఓటమి పాలైంది. మాజీ మంత్రి జవహర్‌ని అక్కడ ఉండే కమ్మ వర్గం వ్యతిరేకించింది. దీంతో చంద్రబాబు..జవహర్‌ని తిరువూరులో నిలబెట్టారు. కొవ్వూరులో అనితని తీసుకొచ్చి నిలబెట్టారు. అయినా గెలవలేదు.


ఎన్నికలయ్యాక అనిత..తన సొంత స్థానం పాయకరావుపేటకు వెళ్ళిపోయారు. ఇటు కొవ్వూరుకు జవహర్ రావాలని చూస్తున్నారు. కానీ ఆయన వ్యతిరేక వర్గం ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇప్పటికీ టిడిపి సీటు విషయంలో క్లారిటీ లేదు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి హోమ్ మంత్రి తానేటి వనిత ఉన్నారు. ఆమె పనితీరు పెద్దగా ఏమి బాగోలేదు. పైగా సొంత నేతలతోనే విభేదాలు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని ప్రధాన వర్గాలు మంత్రిపై అసంతృప్తిగా ఉన్నాయి. కమ్మ, కాపు, మాదిగ వర్గాలు వనితకు దూరమయ్యాయి. అలాగే స్థానిక నేతల్లో కూడా అసంతృప్తి ఉంది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీని వీడటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కొవ్వూరులో వనితకు వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. టిడిపి నేతలు కలిసికట్టుగా పనిచేసి..కొవ్వూరులో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

అయితే జవహర్‌ని కమ్మ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది..ఆయనకు మళ్ళీ సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. అటు జవహర్ వర్గం కూడా గట్టిగానే సీటు కోసం చూస్తుంది. జవహర్ అక్కడే సెటిలై ఉన్నారు. కానీ ఆయనకు పూర్తి స్థాయిలో మద్ధతు రావడం లేదు. వైసీపీపై వ్యతిరేకత ఉన్నప్పుడు టిడిపి నేతలు కలిసిపనిచేస్తే ఇబ్బంది ఉండదు..కానీ వారు కూడా గ్రూపు తగాదాలకు దిగుతున్నారు. దీంతో ఈ సారి కొవ్వూరులో ఆసక్తికరమైన ఫైట్ జరిగేలా ఉంది.
