రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి. అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ రాజకీయంగా ప్రత్యర్ధులను అణగదొక్కాలనుకుంటోంది. అదే సమయంలో అధికారం తనకు శాశ్వతం అనుకుంటోంది. నిజానికి అయిదేళ్ళకు మాత్రమే ప్రజలు ఎవరికైనా అధికారాన్ని ఇస్తారు. పాలన బాగులేకపోతే ఓటేసిన ఆ చేత్తోనే తీసి అవతల పెడతారు. ఇవన్నీ ప్రజాస్వామ్య చరిత్రలో అందరికీ తెలిసిన విషయాలే. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతోనే మూడు దశాబ్దాల పాటు తామే పవర్ లో ఉంటామంటూ అతి ధీమాకు పోతున్నట్లుగా ఉంది. మరి అది జరగాలి అంటే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు చేయాలి. కానీ తెలుగుదేశాన్ని టార్గెట్ చేసుకుంటూ పాలనను గాలికి వదిలేసే విధంగా వైసీపీ ఏలుబడి సాగుతోంది.కేవలం రెండేళ్ల కాలంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన 27 మంది కార్యకర్తలను అతి దారుణంగా వైసీపీ నేతలు హత్య చేశారని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తాజాగా ఆరోపించారు.
ఏపీలో హత్యలు దారుణాలు మాత్రమే రెండేళ్ళలో జరుగుతున్నాయని ఆయన మండిపడడం అంటే అధికార పార్టీకి అది మాయని మచ్చగానే చూడాలి. ఈ మధ్యనే కర్నూల్ లో ఇద్దరు అన్న దమ్ములను దారుణంగా వైసీపీ కార్యకర్తలు హత్య చేశారు.అది మరవకముందే మరో జిల్లాలో, ఇంకో జిల్లాలో ఇలా ఒక క్రమ పధ్ధతిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైసీపీ నేతల హత్యాకాండ సాగుతోంది.ఎవరైనా అభివృద్ధి గురించి చెప్పుకుంటారు. ఆ విషయంలో తాము ఎవరితోనైనా పోటీ పడాలనుకుంటారు. కానీ వైసీపీ పాలకుల వైఖరి మాత్రం చూడబోతే ఎదుటి పార్టీ అన్నది లేకుండా చేస్తే తమకు అధికారం శాశ్వతం అవుతుంది అన్నట్లుగా ఉంది. నిజానికి తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు పదులు. ఆ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసింది. ఎన్నో రకాలైన రాజకీయాలను కూడా చూసింది. అలాగే ఒడుదుడుకులను ఎన్నో భరించి ఈ స్థాయికి చేరుకుంది.టీడీపీకి ఉన్నదల్లా పటిష్టమైన కార్యకర్తల బలం. వారు ఎపుడూ పార్టీ జెండాను కిందకు దించరు. వారు పార్టీ కోసమే పాటు పడతారు. వారికి పదవులు అక్కడలేదు.ఆకాశాన పసుపు జెండా రెపరెపలు ఆడుతూంటే దాన్ని చూసి పరవశించడమే వారికి తెలుసు. అలాంటి తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను హతమారిస్తే ఇక పార్టీ ఉండదు అసలు ఏమీ ఉండదు అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు. ఇప్పటికే తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేస్తూ జైళ్ళకు పంపించడం చేస్తూ వైసీపీ సరికొత్త రాజకీయ అరాచకానికి తెర తీసింది.
ఈ హత్యాకాండతో టీడీపీని వంచుదామనుకుంటే అది చాలా పెద్ద తప్పు అని ఆ పార్టీ అధినాయకులు అంటున్నారు. దీనికి ఇంతకు ఇంతా వడ్డీతో సహా తాము చెల్లించి తీరుతామని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అంతే కదా, అన్ని రోజులూ ఒక్కలా ఉండవు. ఈ రోజు బొమ్మ మీది కావచ్చు, అది తిరగబడితే రేపటి రోజున జరిగే పరిణామాలను కూడా భరించాల్సి వస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు. మరి హత్యాంధ్ర ప్రదేశ్ అన్న విమర్శలను చూసి వైసీపీ ఇకనైనా తగ్గుతుందా. చూడాలి.
Discussion about this post