రాజన్న రాజ్యం అంటే.. ఏంటి? ఇదే విషయాన్ని సీఎం జగన్ గత ఎన్నికలకుముందు ప్రస్తావిస్తూ.. రైతు బాగుంటే.. అది రాజన్న రాజ్యం అన్నారు. నిజమే. ఆయన చెప్పింది వాస్తవం. ఎందుకంటే.. వైఎస్ హయాంలో రైతులకు ప్రాధాన్యం ఇచ్చారు. వారికి అనేక రూపాల్లో సాయం చేశారు. ఆత్మహత్యలను నివారించే చర్యలు కూడా తీసుకున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వమే తాను కూడా అందిస్తానని.. మాటిచ్చిన జగన్.,. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైతులు నిజంగానే జగన్ పాలనలో సంతోషంగా ఉన్నారా? ఇదీ ఇప్పుడు చర్చకు వస్తున్నవిషయం.

ఎందుకంటే.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. చేసిన ఏకైక సంచలన నిర్ణయం.. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఇది నిజంగా సంచలనమే. అప్పటి వరకు రైతులకు ఎలాంటి సహాయం కావాలన్నా.. వారు అధికారుల చుట్టూ తిరిగే వారు. నకిలీ పురుగు మందులు, విత్తనాలు కొని నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే.. ఆర్బీకే కేంద్రాల ద్వారా.. రైతులకు అన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని.. జగన్ ప్రకటించారు. దీంతో రైతులకు కష్టాలు తొలిగిపోతాయని అన్నారు.కానీ, క్షేత్రస్థాయిలో రైతులకు ఆర్బీకేల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఇక, రైతులకు ఇచ్చే రుణాలను కూడా గతంలోకౌలు రైతులు విస్తారంగా తీసుకునేవారు. కానీ, ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో కౌలు రైతులకు పాస్ పుస్తకాలు అందక.. రుణాలు కూడా దక్కించుకోలేక పోతున్నారు. ఫలితంగా ప్రభుత్వమే ప్రకటించినట్టు.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క జగన్ పరిపాలనలోనే 394 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి జగన్ రాజన్న రాజ్యం అందిస్తున్నప్పుడు.. కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారనేది ప్రభుత్వం పట్టించుకోవాలి.

అదే సమయంలో పగటి పూటే 9 గంటల విద్యుత్ అందిస్తామన్న జగన్ .. ఇప్పుడు విద్యుత్ కొరత కారణంగా వారికి ఇవ్వలేక పోతున్నారు. మరోవైపు .. రైతులకు ఇచ్చే నీటికి కేంద్రం ఆదేశాల మేరకు మీటర్లు ఏర్పాటు చేశారు. నీటి తీరువాను ఖచ్చితంగా వసూలు చేయాలని అధికారులకు టార్గెట్లు పెట్టారు. ఈ పరిణామాలన్నీ.. కూడా రైతులకు ప్రాణసంకటంగా పరిణమించాయి. వీటిని గమనిస్తున్నవారు.. వైసీపీ విషయంలో రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయని అంటున్నారు. మరి ఈ విషయంపై జగన్ ఆలోచన చేస్తారా.. లేక.. ప్రతిపక్షాల ప్రచారం అని సరిపెట్టుకుంటారో చూడాలి.

Discussion about this post