రచ్చబండపై గ్రామాల్లో రచ్చ జరుగుతోంది. సీఎం సార్.. గ్రామాలకు రండి! అనే మాటే వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది సామాన్యుల నోటి నుంచే వింటే.. “సారు పాదయాత్రలో మా గోడు విన్నారు. కానీ, ఇప్పటికీ.. మాకు న్యాయం జరగడం లేదు“ అనే మాట కొందరి నుంచి వినిపిస్తోంది. అదేసమయంలో మరికొందరు.. గ్రామాల్లో ఇంకా అభివృద్ది సాగడం లేదని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాను పాదయాత్ర సమయంలో చూసిన విధంగా గ్రామీణ భారతాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

ఈ క్రమంలోనే ప్రత్యేక ప్రాతిపదికగా.. గ్రామాలను వర్గీకరించారు. గ్రామీణ భారతంలో ఆదాయం పెంచాలని నిర్ణయించారు. రైతులకు అన్ని విధాలా సాయం చేసేందుకు.. అనేక ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశారు. అదేసమయంంలో ప్రజాప్రతినిధులను కూడా రంగంలోకి దింపుతున్నట్టు చెప్పారు. కానీ, ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయినా.. గ్రామీణ స్థాయిలో ప్రజలు ఆశించిన విధంగా అబివృద్ధి కనిపించడం లేదు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో అయితే.. గ్రామాల్లో ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. పనులు లేక.. ఇక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు.

మరీ ముఖ్యంగా ఉపాధి హామీ పనులు కూడా ఆశించిన విధంగా ఎక్కడా జరగడం లేదు. ఏదైనా పని ఉన్నా.. పెరుగుతున్న కార్మికులకు అవసరమైన మేరకు పనులు కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యానికి తోడు ప్రభుత్వం వైపు నుంచి ఎన్నో చేస్తున్నామని.. చెబుతున్నా.. అవి గ్రామీణులకు చేరడం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం తప్ప.. గ్రామాల్లో అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తమ గ్రామాలకు రావాలని.. వారు ఎదురు చూస్తున్నారు.

గతంలో ఏయే ప్రాంతాల్లో అయితే.. జగన్ పాదయాత్ర చేశారో.. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోనే తిరిగి ఆయన పర్యటించాలని గ్రామీణులు కోరుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం.. జగన్ ఏదో ఒకటి చేయాలని కూడా వారు పట్టుబడుతున్నారు. మరి జగన్ ఎప్పుడు ముందుకు కదులుతారో చూడాలి. మరోవైపు.. వచ్చే 1వ తేదీ నుంచి ఎమ్మెల్యేలను రంగంలోకి దింపుతున్నా.. వారి వల్ల తమకు ప్రయోజనం లేదని అంటున్నారు. వారు తమ సమస్యలు విన్నా పరిష్కారం చూపే మార్గం లేదని చెబుతున్నారు.

Discussion about this post