వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను జగన్ దాదాపు వదిలేసుకున్నారు. నిజానికి పార్టీ అధినేతగా ఆయనకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. గత ఎన్నికల్లోనూ జగన్ నేతలను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అందుకే ఎక్కడికక్కడ కొత్తవారైనా.. సరే పార్టీ టికెట్లు ఇచ్చారు. దీంతో పార్టీలో ఒక జోష్ కనిపించింది. పైగా.. జగన్ అంటే.. అందరికీ గౌరవం ఏర్పడింది. మా నాయకుడు.. మా నేత.. ఆయన లేకపోతే.. మేం లేం .. అనే వాదన వ్యాఖ్యలు వినిపించాయి.

అయితే.. ఇప్పుడు జగన్ తన బాధ్యతలను పూర్తిగా వదిలేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారు గెలిచి తీరా లని.. ముందుగానే సర్వేలు చేసి. గెలిచేవారికే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే.. దీనిపై వైసీపీ నాయకులు.. పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే.. కొందరు ఆర్థికంగా బలంగా ఉంటే.. మరికొందరు పార్టీ పైనే ఆధారపడ్డారు. పైగా ఇప్పుడు ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదని.. మధ్యతరగతి వర్గం ఆవేదనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమ గెలుపునకు జగన్ పూచీ వహించకపోతే.. ఎలా అనేది వీరి వాదన

మరోవైపు.. ఇదే విధంగా జగన్ వ్యవహరిస్తే.. నాయకుల్లోనూ ఆయనపై ఇప్పుడు న్న ఇమేజ్ ఇకపై ఉండ దని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు తమను గెలిపించారని.. జగన్ లేకపోతే..తాము లేమని.. చాలా మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మనసులో ఏమైనా అనుకోని.. మెజారిటీ ఎమ్మెల్యేలు.. జగన్‌తో నే తాము నడిచామని.. ఆయన ఫొటోతోనే గెలిచామని చెబుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో జగన్ ఇలా .. తన బాధ్యతల నుంచి తప్పుకోవడంపై నేతలు హర్ట్ అవుతున్నారు.

“వచ్చే ఎన్నికల్లో మేం గెలవాలి. ఈ విషయంలో మాకు కూడా క్లారిటీ ఉంది. కానీ, ఇప్పటి వరకు జగన్‌పై మాకు భరోసా ఉంది. రేపు జగన్‌తోనే మేం ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నాం. కానీ, ఇప్పుడు ఆయన కాడి పడేస్తానని చెబుతున్నారు. మరి మా భవిష్యత్తు ఏంటో“ అని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు. మరి ఇదే పరిస్థితి మిగిలిన వారిలోనూ కనిపిస్తోంది. దీనిని బట్టి జగన్ వేసిన అడుగులు చేసిన ఆలోచన ఆదిలోనే రివర్స్ అయ్యేలా ఉందని చెబుతున్నారు.

Discussion about this post