రాష్ట్రంలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అని చెప్పవచ్చు. ఆ జిల్లాల్లో జనసేన..టిడిపి, వైసీపీలకు ధీటుగా ఉంది. గత ఎన్నికల్లో ఆ జిల్లాల్లో భారీగా ఓట్లు చీల్చిన విషయం తెలిసిందే. ఆ ఓట్ల చీలిక టిడిపికి నష్టం, వైసీపీకి లాభం చేసింది. ఇక రెండు జిల్లాలే కాదు..విశాఖ, కృష్ణా జిల్లాల్లో కూడా బాగానే ప్రభావం చూపింది.
అదే సమయంలో గుంటూరులో కూడా జనసేన ప్రభావం కనిపించింది. జిల్లాలో పలు సీట్లలో జనసేన బాగానే ఓట్లు తెచ్చుకుంది. అలా జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపి ఓడింది..వైసీపీ గెలిచింది. అయితే ఈ సారి జనసేన-టిడిపి పొత్తులో కలిసి వెళ్తాయని తెలుస్తోంది. అదే జరిగితే గుంటూరులో వైసీపీకి చెక్ పడుతుంది. ఇక మెజారిటీ సీట్లలో టిడిపి సత్తా చాటడం ఖాయం. జనసేన ప్రభావం వల్ల టిడిపికి బాగా కలిసొచ్చే నియోజకవర్గం తెనాలి..గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి 17 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతే..జనసేన 25 వేల ఓట్లు పడ్డాయి. అంటే రెండు పార్టీలు కలిస్తే వైసీపీ గెలిచేది కాదు.

ఈ సారి ఎన్నికల్లో టిడిపి-జనసేన కలుస్తాయి కాబట్టి తెనాలిలో వైసీపీకి చెక్ పడుతుంది. అయితే పొత్తు ఉంటే తెనాలి సీటు జనసేనకు దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక జనసేన ప్రభావం ఉన్న సీట్లలో ప్రత్తిపాడు కూడా ఉంది. అక్కడ కూడా వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. ఈ సారి రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి ఓటమే.
అలాగే గుంటూరు వెస్ట్, ఈస్ట్, మంగళగిరి, సత్తెనపల్లి స్థానాల్లో జనసేన ప్రభావం ఉంది. గురజాల నియోజకవర్గంలో కూడా కొంత ప్రభావం ఉంది. ఈ సీట్లలో పొత్తు ప్రభావం బాగా ఉంటుంది. టిడిపికి జనసేన కలిసొస్తుంది.