ఏపీలో జనసేన బలం పెంచే దిశగా పవన్ కల్యాణ్ పనిచేయడం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆయన పార్టీ బలోపేతంపై పెద్దగా చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. ఏదో అప్పుడప్పుడు రాష్ట్రానికి రావడం..వైసీపీపై ఫైర్ అవ్వడం చేస్తున్నారు. మళ్ళీ సినిమా షూటింగుల్లో బిజీ అయిపోతున్నారు. అంతే తప్ప పార్టీ బలోపేతంపై కృషి చేయడం లేదు. అందుకే జనసేన అనుకున్న మేర బలం పుంజుకోలేకపోయింది.

అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీపై ఫోకస్ పెట్టారు. కాకపోతే ఇప్పటికిప్పుడు పార్టీని బలోపేతం చేయడం కష్టం. కింది స్థాయి నుంచి నేతలని తయారు చేయడం కష్టమే..అందుకే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని లాగితే సరిపోతుంది. ఈ క్రమంలోనే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. కోవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. ఈయన జనసేనలో చేరాలని డిసైడ్ అయ్యారు. 2009లో ఈయన టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసేశారు.

ఇటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సైతం వైసీపీని వీడారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఈమె..2014లో టిడిపిలో, 2019లో వైసీపీలో చేరారు. వైసీపీలో ప్రాధాన్యత లేదని జనసేన వైపుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు సైతం జనసేనలోకి రావడానికి సిద్ధమయ్యారు. 1994లో ఈయన టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా ఏళ్ళు టిడిపిలోనే పనిచేశారు. తర్వాత బిజేపిలో చేరారు.కానీ బిజేపిలో రాజకీయంగా యాక్టివ్ గా లేరు..దీంతో ఇప్పుడు జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. మరి చూడాలి ఇంకెంత మంది నేతలు జనసేనలో చేరతారో.

