ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందన్నట్లు..అసలు జగన్ మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేయాలని అనుకోలేదు..కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మండలి రద్దు అని హడావిడి చేసి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన ఇద్దరిని పక్కన పెట్టి..కొత్తగా ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చారు.
ఇక మొదట చెప్పిన విధంగా రెండున్నర ఏళ్లలో 14 మంది మంత్రులని పక్కన పెట్టి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 11 మంది పాత మంత్రులని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందనగా, జగన్ కేబినెట్ లో మార్పులు చేయడానికి సిద్ధమయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గంలో చాలామంది మంత్రుల పనితీరు బాగోలేదు. ఏదో పేరుకే మంత్రులుగా ఉన్నారు తప్ప..వారు తమ శాఖలకు సంబంధించిన చేసే పనులు ఏమి లేవు. జగన్ ఏది చెబితే అది చేయడం తప్ప.

ఇంకా విచిత్రం ఏంటంటే కొందరు మంత్రులు అనే సంగతి ప్రజలకు తెలియకపోవడం..అంటే మంత్రుల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పనితీరు ఏ మాత్రం బాగోని మంత్రులని జగన్ పక్కన పెట్టడానికి నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ క్రమంలో అప్పలరాజుని మొదట తీసేస్తారని టాక్ నడుస్తోంది. అలాగే మహిళా మంత్రుల్లో విడదల రజిని లేదా ఉషశ్రీచరణ్‌లని తప్పిస్తారని ప్రచారం ఉంది. ఇక కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావుల్లో ఒకరిని సైడ్ చేయవచ్చని అంటున్నారు.
మొత్తానికి ముగ్గురు, నలుగురు మంత్రులని సైడ్ చేసి వారి స్థానాల్లో కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తోట త్రిమూర్తులు లాంటి వారిని తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే అప్పలరాజుతో జగన్ మాట్లాడారని ఆయనని సైడ్ చేయడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయడం పక్కా అని మాత్రం తెలుస్తోంది. మరి ఎవరికి షాక్ ఇస్తారో చూడాలి.
