కడప జిల్లా వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలు ఏవైనా ఇక్కడ వైసీపీదే హవా…ఇక్కడ వైసీపీకి చెక్ పెట్టడం మాత్రం అంత సులువైన పని కాదు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగానే ఉన్నాయి. అలాంటి పరిస్తితుల్లో కడపలో వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు. కానీ ఈ సారి కొన్ని నియోజకవర్గాల్లో పరిస్తితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేవలం జగన్ బొమ్మ చూస్తే ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇబ్బంది ఉండదు. కానీ ఎమ్మెల్యే పనితీరుని ప్రజలు పట్టించుకుంటే కడప జిల్లాలో సగం ఎమ్మెల్యేలు దెబ్బతినడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేల పనితీరు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇదే సమయంలో కొన్నిచోట్ల టీడీపీ అనూహ్యంగా పుంజుకుంటుంది. అలా టీడీపీ పుంజుకున్న నియోజకవర్గాల్లో మైదుకూరు కూడా ఒకటి.

మొన్న మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ ఎక్కువ వార్డులు గెలిచిన విషయం తెలిసిందే. కానీ అధికార బలంతో ఈ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో కూడా టీడీపీ పర్వాలేదనిపించేలా స్థానాలు గెలుచుకుంది. అంటే 2019 ఎన్నికల సమయంలో ఉన్న పరిస్తితులు ఇప్పుడు కనిపించడం లేదు. మైదుకూరులో చాలా వరకు అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి అనుకున్న మేర మైలేజ్ కూడా వచ్చినట్లు లేదు. ఆయన దశాబ్దాల పాటు టీడీపీలో పని చేసి, తర్వాత వైసీపీలోకి వచ్చి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అంతకముందు టీడీపీలో రెండుసార్లు గెలిచారు. కాబట్టి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడానికి మైదుకూరు ప్రజలు అంత సిద్ధంగా ఉన్నట్లు లేరు. అదే సమయంలో ఇక్కడ టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ అనూహ్యంగా పుంజుకుంటున్నారు.

దీనికి తోడు..మైదుకూరుపై డీఎల్ రవీంద్రకు ఎంత పట్టు ఉందో చెప్పనవసరం లేదు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీకి మద్ధతుగా నిలిచారు. కానీ ఇప్పుడు వైసీపీపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదపడానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిస్తితులని బట్టి చూస్తే మైదుకూరులో టీడీపీకి గెలవడానికి మంచి అవకాశం దొరికినట్లే.


Discussion about this post