టీడీపీ-జనసేన పొత్తు లేకపోతే వైసీపీకి లాభమనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం ఓట్లు చీలి ఏ విధంగా వైసీపీకి లబ్ది జరిగిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని టిడిపి-జనసేనలు చూస్తున్నాయి. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఒకవేళ పొత్తు లేకపోయినా టిడిపికి లీడ్ వస్తుందని తాజా సర్వేలో తేలింది. కానీ అధికారంలోకి రావాలంటే పొత్తు ఉంటేనే బెటర్ అనే సంకేతాలు వస్తున్నాయి.

పొత్తు లేకపోవడం వల్ల వైసీపీ సులువుగా గెలుస్తుంది. అలా వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్న సీట్లలో కాకినాడ సిటీ, రూరల్ సీట్లు ఉన్నాయి. పొత్తు లేకపోతే ఈ రెండు సీట్లలో వైసీపీకే ఆధిక్యం ఉందట. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి రెండు చోట్ల వైసీపీ గెలిచింది. ఈ రెండు చోట్ల జనసేన భారీగా ఓట్లు చీల్చింది. 30-40 వేల ఓట్ల వరకు జనసేన తెచ్చుకుంది. ఆ ఓట్లు గాని టిడిపికి కలిస్తే అప్పుడే వైసీపీ ఓడిపోయేది. ఇప్పుడు కూడా పొత్తు లేకపోతే రెండు చోట్ల వైసీపీ గెలుపు ఖాయమని అంటున్నారు.
అయితే రెండు పార్టీలు పొత్తు దిశగానే వెళుతున్నాయి. పొత్తు ఉంటే కాకినాడ సిటీ, రూరల్ సీట్లని చెరోక పార్టీ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక పొత్తులో రెండు చోట్ల వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా కన్నబాబు ఉన్నారు. ఈ ఇద్దరికీ టిడిపి-జనసేన పొత్తుతో చెక్ పడటం ఖాయమని చెప్పవచ్చు.
