ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల నియోజకవర్గం వైసీపీకి అనుకూలమైన స్థానం అని చెప్పవచ్చు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి కోన రఘుపతి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ గెలిచింది. 1985, 1994 ఎన్నికల్లో కూడా టిడిపి గెలిచింది.
అయితే 1999 ఎన్నికల తర్వాత మళ్ళీ బాపట్లలో టిడిపి గెలవలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అలాంటి స్థానంలో ఇప్పుడు టిడిపి పికప్ అవుతుంది..వైసీపీకి ఎదురుగాలి వీయడం మొదలైంది. ఈ సారి బాపట్లలో వైసీపీకి భారీ దెబ్బ తగిలేలా ఉంది. రెండుసార్లు గెలిచిన సరే బాపట్లకు వైసీపీ వల్ల ఒరిగింది ఏమి లేదు. పైగా వైసీపీలోనే అంతర్గత పోరు ఎక్కువ ఉంది. ఎమ్మెల్యే కోనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పావులు కదుపుతున్నారు.

బాపట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కోన రఘుపతికి వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు నడుపుతున్నారు. ఇటీవల బాపట్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎస్సీ నేత రాజశేఖర్.. ఎమ్మెల్యే తీరును ఎండగుడతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అటు బీసీ వర్గంలో కూడా కోనపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఇలా బాపట్ల నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకం అవ్వడం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపింది.
ఇదే సమయంలో ఇంతకాలం టిడిపికి సరైన నాయకుడు లేక ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు వేగేశన నరేంద్ర వర్మ లాంటి బలమైన నాయకుడు రావడం, ఆయన ప్రజల్లోనే ఉండటం, పార్టీని బలోపేతం చేయడంతో బాపట్లలో టిడిపి ఆధిక్యం పెరిగింది. ఈ సారి వైసీపీకి చెక్ పెట్టి బాపట్లలో టిడిపి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది.
