ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో మిగిలిన అన్ని జిల్లాల కంటే ప్రకాశం జిల్లా నేతలు పార్టీని ముందుండి పరుగులు పెట్టిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రెండు, మూడు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఈ జిల్లా పార్టీ నేతలను మిగిలిన జిల్లాల నేతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు అంటే ఇక్కడ నేతలు ప్రజల్లోకి ఎంత పకడ్బందీగా వెళ్తున్నారో అర్థం అవుతోంది. పార్టీకి దశాబ్దాలుగా దిక్కూదివాణం లేని ఎర్రగొండపాలెం లాంటి నియోజకవర్గంలో గూడూరు ఎరిక్సన్ బాబుకి పార్టీ పగ్గాలు అప్పగించిన వెంటనే నియోజకవర్గ టిడిపిలో ఎక్కడా లేని కొత్త జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెంపై టిడిపి జెండా ఎదుగుతుందని తెలుగు తమ్ముళ్లు ధీమాతో ఉన్నారు.

ఇదిలా ఉంటే జిల్లాలో ప్రస్తుతం పార్టీకి మూడు నియోజకవర్గాల్లో ఇన్చార్జులు లేరు. దర్శిలో తాత్కాలిక ఇన్చార్జిగా పమిడి రమేష్ ను నియమించారు. అయితే రమేష్ ఇప్పుడిప్పుడే అక్కడ పుంజుకుంటున్న పరిస్థితి ఉంది. జిల్లా నేతల సమన్వయంతో కొద్దిరోజుల క్రితం జరిగిన దర్శి మున్సిపల్ ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకున్నారు. ఇక చీరాలలో నియోజకవర్గ ఇంచార్జ్ ఎవరో నియోజకవర్గ పార్టీ నాయకులకే తెలియని దుస్థితి ఉంది. ఇక నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న మరో నియోజకవర్గం కందుకూరులో ఎవరు కొత్త నేతగా వస్తారు ? అన్న దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

కందుకూరు రేసులో సత్య..!
స్థానికంగా రెండు, మూడు పేర్లు వినిపిస్తున్నా… చంద్రబాబు మదిలో పార్టీ యువనేత దామచర్ల సత్య పేరు ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా టిడిపిలో గత దశాబ్ద కాలంగా దామచర్ల సత్య కీలకంగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన 2014తో పాటు, పార్టీ ఓడిపోయిన 2019 ఎన్నికల్లోనూ దామచర్ల ఫ్యామిలీ సొంత నియోజకవర్గం కొండపిలో టిడిపి విజయం సాధించడంలో సత్య కీలక పాత్ర పోషించారు. సత్యకు యువతలో మంచి గ్రిప్ ఉంది. ఇక సత్యను బాబు నమ్మటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి.
బలమైన దామచర్ల ఫ్యామిలీ వారసత్వంతో పాటు ఆర్థిక, అంగబలం పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు కందుకూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. టిడిపి ఇక్కడ గత కొన్ని దశాబ్దాలుగా కమ్మ వర్గానికి చెందిన వారికే టిక్కెట్లు ఇస్తోంది.

సత్య బలాలు ఇవే…
ఇక 2014 లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచి తర్వాత టిడిపి లోకి వచ్చిన సీనియర్ నేత పోతుల రామారావు గత ఎన్నికల్లో ఓటమి అనంతరం అనారోగ్యానికి గురి కావడంతో ఆయన యాక్టివ్‌గా ఉండటం లేదు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వయసు పైబడటంతో నియోజకవర్గంలో తిరగలేక పోతున్నారు. ఈ ఇద్దరు నేతల అంగీకారంతో దామచర్ల సత్యకు కందుకూరు పార్టీ పగ్గాలు ఇస్తే అక్కడ పార్టీకి తిరిగి ఉండదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సత్యకు జనాల్లోకి చొచ్చుకుపోగల గుణం ఉంది. లౌక్యంతో పాటు తెరముందు… తెరవెనుక రాజకీయ వ్యూహాలు పెట్టగల నేర్పరి… అందుకే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కొండపిలో స్వల్ప మెజార్టీతో బయటపడటానికి సత్య వ్యూహాలు ప్రధాన కారణం.

వాస్తవానికి గత ఎన్నికలకు ముందు కొండపి నియోజకవర్గ టిడిపిలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఓ బలమైన వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామికి టిక్కెట్ ఇవ్వవద్దని తీర్మానించింది. అయితే వారందర్నీ ఏకతాటి మీదకు తీసుకు రావడంతో పాటు స్వామిని వరుసగా రెండోసారి గెలిపించడంలో సత్య ప్లానింగ్ బాగుంది. ఇక్కడ పార్టీ మొన్న గెలిచాక సత్యపై బాబుకు మరింత గురి కుదిరింది. ఇక గత ఏడాది కాలంగా చంద్రబాబు కూడా దామచర్ల సత్యకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలతో పాటు నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే ఈ పార్టీలో కూడా కీలక పదవి ఇచ్చారు.

ఈ ఈక్వేషన్ ఎలా సెట్ చేస్తారో ?
దామచర్ల కుటుంబానికి ఇప్పటికే ఒంగోలు సీటు ఉంది. ఇక వారి సొంత నియోజకవర్గం కొండపిలో కూడా ఆ కుటుంబ రాజకీయాల నడుస్తాయి. ఇక ఇదే ఫ్యామిలీకి కందుకూరు సీటు ఇస్తే పార్టీ నేతల నుంచి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా ? అని కొందరు సందేహిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో ప్రతి సీటు ఖచ్చితంగా గెలవాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే కందుకూరుకు సత్య అయితేనే కరెక్ట్ అని బలమైన నిర్ణయానికి వచ్చిన ఆయన సత్య వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సత్య పేరు కందుకూరుకు పరిశీలించడానికి ముందే దర్శి విషయంలో కూడా ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే దర్శి కంటే కొండపి పక్కనే ఉన్న కందుకూరులోనే సత్య బలమైన అభ్యర్థి అవుతాడని అక్కడ నుంచే ఆయన్ను బరిలో దింపాలని బాబే నేరుగా నిర్ణయం తీసుకున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

Discussion about this post