ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు వైఖరి నచ్చక కన్నా బిజేపిని వీడారు. ఇక ఈయన త్వరలోనే టిడిపి లేదా జనసేనలో గాని చేరతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ లేదు గాని..ఎక్కువ శాతం టిడిపిలోకి రావచ్చు అనే చర్చ మాత్రం సాగుతుంది. ఇక కన్నా టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో టిడిపి సీనియర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కన్నా టీడీపీలోకి ఎలా వస్తారని.. ఆయన టీడీపీలోకి వస్తే ఏం చేయాలో తనకు తెలుసంటూ రాయపాటి వ్యాఖ్యానించారు. తనను.. పార్టీ అధినేత చంద్రబాబును తిట్టారని.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని, తనకు తాను పులిని అని చెప్పుకొనే కన్నా..ఎన్నికల్లో ఎలా ఓడిపోయారని అన్నారు. అయితే గతంలో రాయపాటి, కన్నా కాంగ్రెస్ లో పనిచేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచే వీరి మధ్య పోరు నడుస్తోంది. అలాగే వీరి మధ్య కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాయపాటి టిడిపిలోకి వస్తే, కన్నా బిజేపిలోకి వెళ్లారు.

కానీ ఇప్పుడు కన్నా బిజేపిలోకి వస్తారనే ప్రచారం నేపథ్యంలో రాయపాటి ఫైర్ అవుతున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉండగా కన్నా పెదకూరపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంతో తాను గుంటూరు ఎంపీగా బరిలో నిలిచిన అంశాన్ని రాయపాటి గుర్తు చేసారు. కన్నా కంటే తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కన్నా ప్రతాపం ఏంటో తెలుస్తుందని, కన్నా జనసేనలోకి వెళ్తారని, టీడీపీలోకి వస్తే ఏం చేయాలో తనకు తెలుసని రాయపాటి చెప్పారు.

టీడీపీ బలం ఉందని, ఎవరి బలం పైనా ఆధారపడాల్సిన అవసరం లేదని, జనసేనతో పొత్తు లేకపోయినా పార్టీకి నష్టం లేదని, చంద్రబాబు, లోకేష్ మినహా మరెవరినీ ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా అంగీకరించే పరిస్థితి లేదని..అందుకు నేతలు, కార్యకర్తలు ఒప్పుకోరని రాయపాటి చెప్పుకొచ్చారు.
