ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై ఏపీలో చర్చలు ఎలా ఉన్నప్పటికీ.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఏర్పాటు చేసిన జగన్ 2.0 కేబినెట్‌లో తెలంగాణకు చెందిన మహిళా నాయకురాలికి మంత్రి పదవి ఇవ్వడంపై తెలంగాణ రాజకీయ నేతలు స్పందించారు. ఇదేదో రాజకీయ వ్యూహంలో భాగమేనని వారు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా.. సీఎం కేసీఆర్‌కు, ఏపీ సీఎం జగన్‌కు మధ్య ఇటీవల కాలంలో అనేక వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిం దే. జల వివాదాలు, విద్యుత్ బకాయిల రగడ, ఉద్యోగుల విభజన వంటి పలు అంశాలు వివాదాల సుడిలో చిక్కుకున్నాయి.
దీనికి మరో కొత్త వివాదం కూడా తోడైంది. కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయాల కోసం ఉద్యమిస్తున్నారు అన్ని ప్రాంతీయ పార్టీలకు ఆయన ఐకాన్‌గా మారుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇటవల కాలంలో బీజేపీయేతర ప్రాంతీయ పక్షాల కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం లో ఉన్నారు. దీనికి పొరుగున ఉన్న తమిళనాడు.. తదితర రాష్ట్రాలు ఆయనకు సహకరిస్తున్నా.. పక్కనే ఉన్న దాయాది రాష్ట్రం ఏపీ నుంచి ఎలాంటి సంకేతాలూ రావడం లేదు. పైగా ప్రధానితో సై! అంటూ.. ఉద్యమాలు చేస్తున్నా.. సమస్యలపై గళం విప్పుతున్నా.. ఏపీ సహకరించడం లేదని.. కేసీఆర్ .. తరచుగా తన వారి దగ్గర అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీపై మరింత గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలోనే జగన్ తన కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చెందిన నాయకురాలు.. విడదల రజనీకి కేబినెట్‌లో చోటు కల్పించారు. ఆమెకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. ఈమె పుట్టుకతో తెలంగాణ బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు. సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు.
ఈయనకి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు రజని రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైంది. ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య మంత్రిగా చోటు దక్కించుకున్నారు. వాస్తవానికి ఇది కీలక పోస్టు. అయినప్పటికీ.. జగన్ ఆమెకు కట్టబెట్టారు. దీనివెనుక.. కేసీఆర్‌ను ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారా? అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ సాగుతోంది.
ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు.. జగన్‌పై విమర్శలు చేస్తున్నారు వీటికి అడ్డుకట్ట వేయడంతోపాటు.. తెలంగాణ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చారనే పేరును పొందేందుకు జగన్ ఇలా చేసి ఉంటారని.. తెలంగాణ నేతలు గుసగుసలాడుతున్నారు. మరి దీనిపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Discussion about this post