తెలుగుదేశం పార్టీకి పెద్దగా అచ్చిరాని స్థానాల్లో అరకు కూడా ఒకటి. గిరిజన ప్రాంతంగా ఉన్న అరకులో టిడిపికి పెద్ద బలం కనిపించడం లేదు. 2009 ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది గాని..2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది..పైగా టిడిపికి నాయకత్వ సమస్య ఉంది. 2009లో టిడిపి నుంచి సివేరి సోమ గెలిచారు..2014లో వైసీపీ నుంచి కిడారి సర్వేశ్వరరావు గెలిచారు.

వైసీపీ నుంచి గెలిచిన కిడారి తర్వాత టిడిపిలోకి వచ్చారు. సోమ,కిడారి కలిసి పనిచేసుకుంటూ వచ్చారు..కానీ ఈ ఇద్దరు నక్సలైట్లలో కాల్పుల్లో మరణించారు. దీంతో చంద్రబాబు కిడారి తనయుడు శ్రావణ్‌ని తీసుకొచ్చి మంత్రిని చేశారు. ఆరు నెలల పాటు మంత్రిగా చేసి..2019 ఎన్నికల్లో శ్రావణ్ టిడిపి నుంచి పోటీ చేశారు. కానీ రాష్ట్రంలో టిడిపి తరుపున డిపాజిట్ కోల్పోయింది కూడా శ్రావణ్ మాత్రమే. కేవలం 20 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చెట్టి ఫాల్గుణ గెలిచారు. రెండోస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి దొన్ను దొర నిలిచారు.

ఇలా దారుణంగా ఓడిపోయిన అరకులో ఇప్పటికీ టిడిపి పికప్ అవ్వలేదు. వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నారు. శ్రావణ్ సైతం పార్టీలో పెద్దగా యాక్టివ్ ఉండటం లేదు. ఈ క్రమంలో నెక్స్ట్ సీటు శ్రావణ్ కు దక్కడం కష్టమే అని తేలుతుంది.
అదే సమయంలో దొన్ను దొర టిడిపిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇండిపెండెంట్ గా పోటీ చేసి సొంతంగా 27 వేల ఓట్లు తెచ్చుకున్న దొన్ను దొరకు నియోజకవర్గంలో ఫాలోయింగ్ ఉంది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఈయనకే ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. మరి అభ్యర్ధిని మారిస్తే అరకులో టిడిపి రాత మారుతుందేమో చూడాలి.