March 24, 2023
కిరణ్‌కుమార్‌రెడ్డి @ బిజేపి
ap news latest AP Politics telangana politics

కిరణ్‌కుమార్‌రెడ్డి @ బిజేపి

కాంగ్రెస్‌ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ పంపినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరే యోచనలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డితో బీజేపీ ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం అందింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గతంలోనూ ఇలాంటి చర్చే జరిగినా.. ఆయన కాంగ్రె‌స్ పార్టీలోనే కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌చేపట్టిన జోడో యాత్రకు కూడా నల్లారి దూరంగా ఉండడంతో ప్రస్తుతం జరుగుతున్న చర్చపై ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి మానసికంగా సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించిన ఆయన.. విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు. అయితే ఎవరూ గెలవలేదు. దీంతో సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ఏపీసీసీ సమన్వయకమిటీ సభ్యునిగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదిలావుంటే, గత రెండు నెలలుగా బీజేపీ అగ్ర నేతలు నల్లారితో టచ్‌లో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ తెలంగాణ శాఖలో చేరాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పార్టీలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు నల్లారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సంప్రదింపుల ప్రక్రియ కొలిక్కి వస్తోందని.. త్వరలోనే బీజేపీ అగ్రనేతలను కలసి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజేపీ కండువా కప్పుకొంటారని భావిస్తున్నారు. అయితే ఇవాళ కాంగ్రెస్‌ పార్టీకి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.