ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి ఈ సారి సత్తా చాటేలా ఉంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే త్వరగా నేతలు పికప్ అవ్వడంతో చిత్తూరులో పరిస్తితి మారుతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే టిడిపి కేవలం ఒక్క కుప్పంలోనే గెలిచింది. మిగిలిన సీట్లలో ఓటమి పాలైంది. అధికార బలంతో వైసీపీ నేతలు తమదైన శైలిలో రాజకీయం చేస్తూ వచ్చారు. ఆఖరికి కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని ఎలాంటి రాజకీయం చేశారో తెలిసిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు టిడిపికి కాస్త ఊపు తీసుకొచ్చిందనే చెప్పాలి. ప్రతి విషయంలోనూ నేతలు పోరాట పటిమ కనబర్చడం పార్టీకి ప్లస్ అయింది. ఈ సారి చిత్తూరులో టిడిపి మంచి ఫలితాలే రాబట్టేలా ఉంది. ఇక జిల్లాలో పార్టీని అన్నివిధాలుగా ముందు ఉండి నడిపిస్తున్న సీనియర్ నేతలు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు..ఈ సారి తమ తమ స్థానాల్లో సత్తా చాటడం ఖాయమని చెప్పవచ్చు.

గత ఎన్నికల్లో అమర్నాథ్..పలమనేరులో, కిషోర్ పీలేరులో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో చంద్రబాబు తర్వాత సీనియర్ నేతలుగా ఉన్న ఇద్దరు నేతలు ఓటమి టిడిపికి పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది. అయితే ఓడిపోయాక వీరు ఎఫెక్టివ్ గా పనిచేస్తూ వచ్చారు. ఓ వైపు జిల్లాలో పార్టీ కోసం పోరాడుతూనే…తమ తమ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.

ఇద్దరు నేతలు ఇప్పుడు పికప్ అయ్యారు. పలమనేరులో అమర్నాథ్, పీలేరులో కిషోర్ లీడ్ లోకి వచ్చినట్లే కనిపిస్తున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం ఇద్దరు నేతలకు కలిసొస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు నేతలు గెలవడం ఖాయమని తెలుస్తోంది.
.