కొడాలి నాని..ఈ పేరుని పెద్దగా పరిచయం చేయనక్కర్లేదనే చెప్పాలి..వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఈయన పేరు చెప్పగానే బూతులే గుర్తొస్తాయి. అంటే అలాంటి పరిస్తితి తెచ్చుకుంది కూడా కొడాలినే. ఈయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్న తన సొంత నియోజకవర్గం గుడివాడకు పెద్దగా చేసే అభివృద్ధి లేదు. ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలకు అందుతున్నాయి తప్ప..కొడాలి వల్ల గుడివాడ ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమి లేదనే విమర్శలు వస్తున్నాయి.

సరే ఆ విషయం పక్కన పెడితే..కొడాలి పేరు చెబితే బూతులే గుర్తు రావడానికి కారణాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే టిడిపి వదిలి వైసీపీలోకి వెళ్లారో అప్పటినుంచి..చంద్రబాబుని ఎలా టార్గెట్ చేస్తూ వస్తున్నారో తెలిసిందే. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుని బూతులు తిడుతూ వస్తున్నారు. ఇంతకాలం రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ మాత్రమే చూశాం..కానీ కొడాలి మాత్రం బూతులు పరిచయం చేశారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఏపీ రాజకీయాలు మారిపోయాయి. బూతుల రాజకీయం మారిపోయింది.

ఇక బాబుని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. తాజాగా ఆయన తన నోటికి పనిచెప్పారు. బాబు గన్నవరం పర్యటనపై స్పందిస్తూ.. ఏ పోలీసుకైనా తిక్కరేగితే చంద్రబాబును కాల్చి పారేస్తాడు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. నల్లమల అడవుల్లోకి చంద్రబాబు ఒక్కడే వస్తే.. తానూ, వల్లభనేని వంశీ అక్కడకు వస్తామని, ఒకవేళ తాను, వంశీ చంద్రబాబును కొట్టొస్తే.. ముసలాడు పైకి పోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబు గురించి ఎంత దారుణంగా మాట్లాడారో అర్ధం చేసుకోవచ్చు.

ఇలా కొడాలి మాట్లాడటం వల్ల చంద్రబాబుకు పోయిదేమీ లేదు.. అలా తిట్టడం వల్ల ప్రజలు కూడా బాబుని పట్టించుకోరు అని కొడాలి అనుకుంటున్నట్లు ఉన్నారు. కానీ పరిస్తితి అలా లేదు..తిట్టడం వల్ల బాబుపై ప్రజల్లో సానుభూతి ఇంకా పెరిగింది. ఇటు కొడాలి బూతుల వల్ల వైసీపీపై ప్రజల్లో విరక్తి పెరిగే పరిస్తితి వచ్చింది. అంటే కొడాలి వల్ల వైసీపీకే డ్యామేజ్ జరిగేలా ఉంది.
