ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆ విజయాలు ఎలా సాధించారో అందరికీ తెలుసు. కానీ అదేదో తమ అద్భుతమైన పాలనని చూసి ప్రజలు గెలిపించినట్లు వైసీపీ నేతలు ఆగట్లేదు. వరుసపెట్టి చంద్రబాబుపై దండయాత్ర చేస్తున్నారు. ఇక చంద్రబాబు సీన్ అయిపోయిందని, టిడిపి చాప్టర్ క్లోజ్ అయిపోయిందని మాట్లాడుతున్నారు. మరి ఈ క్రమంలోనే మన కొడాలి నాని కూడా లైన్‌లోకి వచ్చారు. ఇక కొడాలి ఏ విధంగా మాట్లాడతారో చిన్నపిల్లాడికి కూడా తెలుసు. ఈ మధ్య ఆయన టీవీలో కనిపిస్తే చాలు…పిల్లలు చెడిపోతారని చెప్పి పెద్ద వాళ్ళు ఛానల్స్ కూడా మార్చేస్తున్నారట.

అంటే మన నాని ఏ స్థాయిలో పంచాంగం మొదలుపెడతారో తెలిసిందే కదా. ఇక ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నాని గారు తనదైన శైలిలో రెచ్చిపోయారు. యధావిధిగా చంద్రబాబు, లోకేష్‌లని ఇష్టమొచ్చినట్లు తిట్టేశారు. నాని ప్రెస్ మీట్ పెట్టాక వారిని తిట్టకపోతే ఆశ్చర్యపోవాలిగానీ, తిడితే ఆశ్చర్యపోనవసరం లేదని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. అలాగే నానికి టిడిపి నేతలు కూడా తమదైన శైలిలోనే కౌంటర్లు ఇచ్చేశారు.

కాకపోతే ఇక్కడొక ఛాలెంజ్ వచ్చింది.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని మన నాని గారు ఛాలెంజ్ చేశారు. అయితే ఛాలెంజ్ బాగుందిగానీ…నాని అదే మాట మీద ఉండాలని తెలుగు తమ్ముళ్ళు కోరుతున్నారు. అసలే మాట తప్పని, మడమ తిప్పని నాయకుడి కింద పనిచేస్తున్నారు కాబట్టి, నాని ఆ మాట మీద నిలబడాలని తమ్ముళ్ళు చెబుతున్నారు.

ఇప్పుడు అధికార బలం ఉపయోగించుకుని కుప్పంలో ఎలాంటి రాజకీయం చేశారో అందరికీ తెలుసని, ఇదే సీన్ సాధారణ ఎన్నికల్లో రిపీట్ అవుతుందనుకుంటే అది వైసీపీ వాళ్ళ అవివేకమే అని అంటున్నారు. కానీ ఏదేమైనా నాని ఛాలెంజ్ చేశారు కాబట్టి, వచ్చే ఎన్నికల వరకు దాని మీదే ఉండాలని కోరుతున్నారు.

Discussion about this post