తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో గుడివాడ టిక్కెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే నాని 2004 – 2009 ఎన్నికల్లో వరుసగా గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ సిపి కండువా కప్పుకున్నారు. కృష్ణాజిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నాని వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి మూడోసారి గెలిచిన నాని ప్రతిపక్షంలో ఉన్నారు. 2019 లో వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.

జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని నందమూరి , నారా ఫ్యామిలీలను ఎంత దారుణంగా టార్గెట్ చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం. నాని నోరు తెరిస్తే చంద్రబాబు, లోకేష్ తో పాటు చివరకు బాబు భార్య భువనేశ్వరిని సైతం టార్గెట్ చేస్తూనే మాట్లాడుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంత లైఫ్ ఇచ్చినా నాని వ్యవహరిస్తున్న తీరు పార్టీ కేడర్‌కు ఎంతమాత్రం నచ్చటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నానిని ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి క్యాడర్ అంతా కసితో ఉంది.

ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇన్చార్జి గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే కొడాలి నానిని కొట్టాలంటే రావి తో సాధ్యం కాదని పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే డిసైడ్ అయింది. అయితే పార్టీలో రాష్ట్ర నాయకులతో పాటు గుడివాడ టిడిపి క్యాడర్ మాత్రం కొడాలి నాని కి చెక్ పెట్టాలంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరిని ఇక్కడ గుడివాడలో పోటీ చేయించాలని కోరుతున్నారు.

నందమూరి ఫ్యాక్టర్ ఇక్కడ బలంగా పని చేస్తే కొడాలి నాని ని వచ్చే ఎన్నికల్లో సులువుగా ఓడించవచ్చు అని జిల్లా టిడిపి లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గుడివాడలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన నాని పై గుడివాడ ప్రజలు పెట్టుకున్న అంచనాలు అడియాసలు అయ్యాయి అన్న చర్చ స్థానికంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రంగంలోకి దింపితే నానికి తొలిసారి ఓటమిని రుచి చూపించవచ్చన్న చర్చ టీడీపీ కేడర్ లో జరుగుతోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Discussion about this post