రైల్వే కోడూరు..ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం ఒకప్పుడు టిడిపికి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ సత్తా చాటుతుంది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పార్టీ గెలిచింది. 2004లో కాంగ్రెస్ వేవ్ లో టిడిపి ఓడిపోయింది. కానీ 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరగడం..ఈ స్థానాన్ని ఎస్సీ రిజర్వడ్ మార్చడంతో సీన్ మారింది.

అప్పటినుంచి టిడిపికి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మూడు సార్లు వైసీపీ నుంచి కోరుముట్ల శ్రీనివాసులు గెలుస్తూ వస్తున్నారు. ఇలా వరుసగా గెలిచిన కోరుముట్లకు కోడూరులో పెద్ద పాజిటివ్ లేదు. కానీ దాన్ని యూజ్ చేసుకుని బలపడటంలో టిడిపి విఫలమవుతుంది. టిడిపి ఇంచార్జ్ గా నరసింహ ప్రసాద్ ఉన్నారు. ఈయన చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు. గత ఎన్నికల్లో కోడూరులో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నుంచి ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు.


సాంస్కృత కార్యక్రమాల్లో పార్టీ కోసం బాగానే పనిచేస్తున్నారు గాని..కోడూరులో పార్టీని బలోపేతం చేయడంలో విఫలమవుతున్నారు. పైగా ఇక్కడ వర్గ పోరు ఉంది..దీని వల్ల పార్టీ ఇబ్బందులు పడుతుంది. అసలు కడప జిల్లాలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువ ఉన్న స్థానం ఇదే. అందుకే గతంలో ఇక్కడ టిడిపి గెలిచింది. కానీ ఎస్సీ స్థానం మారక సీన్ మారిపోయింది. ఎస్సీ నేతలకు సీటు ఇస్తుండటంతో కమ్మ నేతలు పూర్తిగా సహకరిస్తున్నట్లు కనిపించడం లేదు. దీని వల్ల పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి.

ఇప్పుడు కూడా అక్కడ అదే పరిస్తితి కనిపిస్తుంది. అయితే అంతా కలిసికట్టుగా పనిచేస్తే కోడూరులో గెలిచే ఛాన్స్ ఉంది..లేదంటే కోడూరు మళ్ళీ పోయినట్లే.
