రాజకీయాల్లో నేతల వారసుల రంగప్రవేశం సాధారణంగానే జరుగుతుంటుంది. నేతల తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి…ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారు…ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా గెలిచారు. మరికొందరు మొదటి విజయం సాధించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే మరికొందరు వారసులు సైతం ఎంట్రీ ఇచ్చేందుకు కుతూహలంతో ఉన్నారు.

అయితే కొందరు నేతల వారసులు ఎంట్రీ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు గానీ…అవకాశాలు మాత్రం సరిగా దొరకడం లేదు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ వారసుడుది కూడా ఇదే పరిస్తితి. మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో కీలకంగా ఉన్న కొనకళ్ళ నారాయణ..కొన్నేళ్లుగా మచిలీపట్నం టీడీపీలో ముఖ్య నాయకుడుగా ఉన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

ఇక 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అలాగే ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇలా టీడీపీలో కీలకంగా ఉన్న కొనకళ్ళ…తన తనయుడుని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ మంచి అవకాశం మాత్రం దొరకడం లేదు.

అయితే కొనకళ్ళ తన వారసుడుకు పెడన అసెంబ్లీ సీటు దక్కించుకోవాలని ఎప్పటినుంచో చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన పెడన సీటు కోసం ట్రై చేశారు. కానీ అక్కడ దివంగత కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు…కృష్ణప్రసాద్‌కే సీటు ఇచ్చారు. ఆయన కూడా జగన్ గాలిలో ఓడిపోయారు. ఓడిపోయినా సరే నియోజకవర్గంలోనే పనిచేసుకుంటున్నారు. ఇక కాగిత వారసుడుని పక్కకు తప్పించి తన తనయుడుకు సీటు ఇప్పించుకోవాలని కొనకళ్ళ చూస్తున్నారుగానీ, చంద్రబాబు మాత్రం అవకాశం ఇచ్చేలా లేరు.

కాగిత వారసుడుని కాదని కొనకళ్ళ ఫ్యామిలీకి టిక్కెట్ ఇవ్వడం జరగని పని. ఒకవేళ కొనకళ్ళ పోటీ నుంచి తప్పుకుని ఎంపీ సీటుని తన తనయుడుకు ఇచ్చుకునే అవకాశం మాత్రం ఉంది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో కొనకళ్ళ వారసుడుకు సీటు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు.

Discussion about this post