కృష్ణా జిల్లాకు రాజకీయంగా గుండె కాయ వంటి మచిలీపట్నంలో అధికార పార్టీ పరిస్థితి ఏంటి? నాయకులు ఎలా ఉన్నారు? పార్టీ పరిస్తితి ఏవిధంగా ఉంది? వంటి విషయాలను పరిశీలిస్తే.. అంతర్గత కుమ్ములాటలతో నాయకులు కుమిలిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు జోరుగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఎక్కువ మంది నాయకులు ఎవరికి వారుగా ముందుకు సాగుతున్నారు. మచిలీపట్నం పార్లెమంటు నియోజకవర్గం పరిధిలో గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలు ఉన్నాయి.

గత ఎన్నికల తర్వాత.. మచిలీపట్నం నుంచి విజయం దక్కించుకున్న పేర్ని నానికి, గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నానికి మంత్రి పదవులు ఇచ్చారు. అయితే.. పెనమలూరు నుంచి విజయం సాధించిన కొలుసు పార్థసారథి కూడా మంత్రి పదవి ఆశిం చారు. అదేవిధంగా పెడన నుంచి గెలిచిన జోగి రమేష్ కూడా సీటును ఆశించారు. అయితే.. తొలి కేబినెట్‌లో కొడాలి, పేర్నిలకు జగన్ అవకాశం ఇచ్చారు. దీంతో మంత్రి పదవులు ఆశించిన వారికి ఆశాభంగం అయింది. దీంతో వారు గత మూడేళ్లలో మంత్రులకు సహకరించిన పరిస్థితి కనిపించలేదు.



దీంతో మంత్రులు ఏమీ చేయలేక పోయారనే వాదన వినిపించింది. పైగా.. మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ హవా ఎక్కువ ఉంది. దీనిని అధిగ మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాల్సిన వైసీపీ నాయకులు పదవుల కోసం.. పాకులాడుతూ.. నియోజకవర్గాల్లో కలివిడిగా లేక పోవడంతో వైసీపీ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక, ఇటీవల ఆ ఇద్దరు మంత్రులు.. కొడాలి, పేర్నిలను పక్కన పెట్టిన.. ప్రభుత్వం.. జోగికి మంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. దీంతో పరిస్థితి మళ్లీ యథాతథంగానే మారిపోయింది.

మాజీలైన ఇద్దరు మంత్రులు కూడా కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. కనీసం.. ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఇక, పదవులు వస్తాయని ఆశించిన భంగ పడిన నాయకుడు కూడా మౌనంగా ఉంటున్నారు. మరోవైపు.. మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి.. నియోజకవర్గంలో పర్యటించడం.. ప్రజలను కలవడం అనేది లేనేలేదని అంటున్నారు స్థానికులు. ఆయన కేవలం ఢిల్లీకే పరిమితమయ్యారు. పలితంగా ఇక్కడ అభివృద్ధి అనేది కనిపించకపోగా.. నేతల మధ్య సఖ్యత కూడా కనిపించడం లేదు. దీంతో మచిలీపట్నం వైసీపీలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post