తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి కృష్ణా ఒకటి. ఈ జిల్లాలో టీడీపీ మంచి విజయాలే సాధించింది..కానీ గత ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపికు ఎదురుదెబ్బ తగిలింది…అయినా సరే త్వరగా పికప్ అవుతూ ఆధిక్యం దిశగా టిడిపి దూసుకెళుతుంది. ప్రస్తుతానికి జిల్లాలో టిడిపి బలం పెరిగింది. ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటించారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం చేశారు.
అయితే మూడు నియోజకవర్గాలకు చుట్టూ ఉన్న స్థానాలపై కూడా బాబు టూర్ ప్రభావం పడింది. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, గుడివాడ, గన్నవరం, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాలపై ప్రభావం చూపింది. దీని వల్ల ఆయా స్థానాల్లో టిడిపికి పట్టు పెరిగింది. అదే సమయంలో టిడిపి గట్టిగా దృష్టి పెట్టిన రెండు స్థానాలు గుడివాడ, గన్నవరంల్లో కూడా సీన్ మారుతుంది.

ఆ స్థానాల్లో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఎదురుగాలి మొదలైంది. అదే సమయంలో ఈ సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులని బాబు ఓ నిర్ణయానికి వచ్చేలా ఉన్నారు. గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడానికి ఎన్‌ఆర్ఐ వెనిగండ్ల రాముని బరిలో దింపడం ఖాయమని తెలుస్తోంది. ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నా సరే…ఆర్ధికంగా, సామాజికంగా రాము బలంగా ఉన్నారు.దీంతో రాముకే గుడివాడ సీటు ఇస్తారని తెలుస్తోంది.
అటు గన్నవరం సీటు కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఉండగా, మరో వైపు టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి సైతం సీటు కోసం ట్రై చేస్తున్నారు. అటు విజయవాడకు చెందిన దేవినేని అపర్ణ సైతం గన్నవరం సీటుపై ఫోకస్ పెట్టారు. మరి వీరిలో చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారో చూడాలి. ఏదేమైనా ఈ రెండు సీట్లని గెలవాలని టిడిపి శ్రేణులు కసి మీద ఉన్నాయి.
