ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి పట్టు ఎక్కువున్న విషయం తెలిసిందే. జిల్లాలో వైసీపీ ఆధిక్యం ఉంది. అయితే జిల్లాలో కొన్ని స్థానాల్లో టిడిపికి కాస్త బలం ఉంది. అలా బలం ఉన్న స్థానాల్లో ఎమ్మిగనూరు కూడా ఒకటి. ఇక్కడ మొదట్లో టిడిపి హవానే నడిచింది. కానీ తర్వాత టిడిపికి భారీ దెబ్బ తగిలింది. 1985 నుంచి 1999 వరకు ఇక్కడ టిడిపి వరుసగా గెలిచింది.
కానీ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2012 ఉపఎన్నికలో వైసీపీ గెలవగా, మళ్ళీ 2014 ఎన్నికల్లో టిడిపి సత్తా చాటింది. గతంలో నాలుగుసార్లు టిడిపి నుంచి గెలిచిన బీవీ మోహన్ రెడ్డి తనయుడు బీవీ జయనాగేశ్వర్ రెడ్డి 2014లో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఆయన ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి చెన్నకేశవ రెడ్డి గెలిచారు. ఈయన 2004, 2009, 2012లో గెలిచారు.

రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న చెన్నకేశవ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచి..ఎమ్మిగనూరులో అనుకున్న మేర అభివృద్ధి పనులు చేయలేకపోయారు. పైగా వయసు మీద పడటంతో ఆయన తనయుడు నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ టిడిపి అనుకున్న విధంగా బలపడలేదు. పైగా గ్రూపు తగాదాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర ఎమ్మిగనూరులోకి ఎంట్రీ ఇచ్చింది..అక్కడ పాదయాత్రకు ప్రజా మద్ధతు భారీగా వచ్చింది. దీంతో టీడీపీకి కొత్త ఊపు వచ్చింది. భారీ సభ పెట్టి..ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి టార్గెట్ గా లోకేష్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే సొంత ఊరు కడిమెట్లలో ప్రభుత్వ, అటవీ భూమి వంద ఎకరాలు కబ్జా చేశారని, అదే ఊళ్లో దేవదాయ భూమి 30 ఎకరాలు ఏకంగా తన పేరున ఆన్‌లైన్ చేసుకున్నారని, ఎమ్మెల్యే అనుచరులు నాగులదిన్నె గ్రామంలో ఏకంగా హిందు శ్మశానాన్నే కబ్జా చేసి షాపులు కడుతున్నారని ఆరోపణలు చేశారు. అయితే వీటిపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశాలు ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. ఇటు టిడిపికి ప్లస్ అవుతుంది. జయనాగేశ్వర్ రెడ్డి కాస్త కష్టపడితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరులో గెలిచే ఛాన్స్ ఉంది.