లోకేష్ పాదయాత్ర సక్సెస్ కాలేదని, అసలు పాదయాత్రలో జనం లేరని చెప్పి అధికార వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలా విమర్శలు చేస్తున్న వారే..లోకేష్ ఏమైనా విమర్శలు చేస్తే చాలు వెంటనే స్పందిస్తూ..లోకేష్ పై విరుచుకుపడుతున్నారు. అటు పోలీసుల ద్వారా పాదయాత్రకు ఏదొక విధంగా ఆటంకాలు సృష్టించడానికే చూస్తున్నారు. అసలు పాదయాత్ర సక్సెస్ కాలేదని అంటూ..దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎందుకు ప్రయత్నిస్తుందో అర్ధం కాకుండా ఉంది.

అంటే పాదయాత్రకు ప్రజా స్పందన బాగుందనే చెప్పాలి. కాకపోతే కొన్ని మీడియా సంస్థలు పాదయాత్రని హైలైట్ కాకుండా చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ స్థానికంగా లోకేష్ పాదయాత్రకు హైప్ ఉంది. అంటే ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారో అక్కడ లోకేష్ పాదయాత్ర విజయవంతంగా నడుస్తోంది. అదే సమయంలో లోకేష్ పక్కా వ్యూహం ప్రకారం వైసీపీ మంత్రులని టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరులో లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులని టార్గెట్ చేసుకుని లోకేష్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

చిత్తూరులో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, నారాయణస్వామి టార్గెట్ గా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లాలో అక్రమంగా ఇసుక, గ్రావెల్, గ్రానైట్ దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. భూ దోపిడి, కమిషన్లు తీసుకోవడంలో మంత్రులు ఆరితేరిపోయారని ఆరోపిస్తున్నారు. ఇలా ఎక్కడకక్కడ ఆరోపణలు గుప్పించడంతో మంత్రులపై ఎఫెక్ట్ పడుతుంది. వాటిపై కౌంటర్లు ఇవ్వకుండా..లోకేష్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.

దీని వల్ల ప్రజలకు మంత్రులపై క్లారిటీగా అవగాహన వస్తుంది. మంత్రుల అక్రమాలు చేస్తున్నారనే భావన పెరుగుతుంది. అటు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలని సైతం లోకేష్ వదలడం లేదు. వైసీపీ ప్రతి అవినీతి కార్యక్రమాన్ని ఎండగడుతున్నారు. ఇలా ఎక్కడక్కడ లోకేష్ వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు.
