టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు నిత్యం కష్టపడుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన పార్టీని ఈ మూడున్నర ఏళ్లలో చాలా వరకు పార్టీని బలోపేతం చేశారు. ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూ…మరోవైపు ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే టీడీపీ ఇంకా బలపడాల్సిన పరిస్తితి ఉంది. ఆ పరిస్తితిని సరిచేయడానికి లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

లోకేష్ పాదయాత్ర చేయడం ద్వారా టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే పాదయాత్ర అనేది టీడీపీకి పెద్ద ప్లస్ అయ్యేలా ఉంది. ఇదే సమయంలో వైసీపీ..పాదయాత్రని అడ్డుకుంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు పాదయాత్రని అడ్డుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ నేతలు సైతం దమ్ముంటే పాదయాత్రని అడ్డుకుని చూడంటూ సవాళ్ళు విసురుతున్నారు.

ఈ సవాళ్ళ మధ్య జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి మొదలుకానుంది. అయితే లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటే పరోక్షంగావైసీపీకే నష్టం జరుగుతుందని చెప్పాలి. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ కార్యక్రమాలని ఏ విధంగా అడ్డుకుంటు వచ్చి..పరోక్షంగా ఆ పార్టీపై ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేసిందో తెలిసిందే. ఈ సారి లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటే వైసీపీకే ఇబ్బంది అయ్యేలా ఉంది. ఇక లోకేష్ పాదయాత్ర అంశంతో టీడీపీ శ్రేణుల్లో దూకుడు కనిపిస్తోంది. ఈ పాదయాత్ర పార్టీకి మరింత ఊపు తీసుకొస్తుందని భావిస్తున్నారు.
