లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారని వార్త వచ్చిన వెంటనే..వైసీపీ నేతలు లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటామని స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. మంత్రి మేరుగు నాగార్జున..దళితులకు టీడీపీ ఏం చేసిందో చెప్పి లోకేష్ పాదయాత్ర చేయాలని, లేదంటే అడ్డుకుంటామని అంటున్నారు. అసలు ఇదేం లింక్ అనేది అర్ధం కాకుండా ఉంది. ఎప్పటినుంచో లోకేష్ పాదయాత్ర చేస్తారని కథనాలు వస్తున్నాయి.

అధికారికంగా టీడీపీ నుంచి ప్రకటన వచ్చింది..400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు, 100 స్థానాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం పాదయాత్ర జరగనుంది. దీనికి యువగళం అని పేరు పెట్టారు. ఈ పాదయాత్రని వైసీపీ సజావుగా సాగనిచ్చేలా కనబడటం లేదు..అందుకే టీడీపీ నేతలు లోకేష్ పాదయాత్ర అడ్డుకుంటే ఊరుకునేది లేదని అంటున్నారు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా జగన్ పాదయాత్ర సాగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీడీపీ ప్రభుత్వం జగన్ పాదయాత్ర సజావుగా సాగేలా చూసుకుంది. ఆ పాదయాత్ర చేయడం ద్వారా జగన్ గెలిచి అధికారంలోకి రాగలిగారు అని, అదే అప్పుడే అడ్డుకుని ఉంటే పరిస్తితి వేరేగా ఉండేదని టీడీపీ నేతలు అంటున్నారు.

అయినా వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదొకరకంగా టీడీపీ కార్యక్రమాలని వైసీపీ అడ్డుకుంటూనే ఉంది. అటు అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇపుడు లోకేష్ పాదయాత్రని అడ్డుకుని తీరుతామని అంటున్నారు. అంటే ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమే వైసీపీ టార్గెట్ గా ఉంది. దీని ద్వారా తమకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నట్లు ఉన్నారు. మరి చూడాలి లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతుందో..అలాగే ముందస్తు ఎన్నికలు వస్తే 400 రోజుల పాదయాత్ర చేయడానికి కుదరదు.
