Site icon Neti Telugu

పాదయాత్రలో నిప్పులు చెరిగిన లోకేశ్‌

అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు……

అసభ్యకర పోస్టులు పెడితే చెప్పులతో కొట్టండి !!

శాసనసభ సాక్షిగా నా తల్లిని అత్యంత దారుణంగా అవమానించారు. నా తల్లి కోలుకునేందుకు ఆరు నెలలు పట్టింది. వైసీపీ కుక్కలు మహిళల జోలికొస్తే నాకు చెప్పండి. ఆ కుక్కల తోలు తీస్తా. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చెప్పులతో కొట్టండి. మీకు అండగా మేం నిలబడతాం. అధికారంలోకి రాగానే భూ కబ్జాలు, అక్రమ దందాలన్నింటినీ ఉక్కుపాదంతో అణచివేస్తాం’ అంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్‌ నిప్పులు చెరిగారు. 30వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మంగళవారం తిరుపతిజిల్లా చంద్రగిరి మండలం మామండూరు విడిది కేంద్రం నుంచి పాకాల మండలం గాదంకి వరకూ నడక సాగించారు. మార్గమధ్యంలోని కాశిపెంట్లలో మహిళలతో సమావేశమయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్‌రెడ్డి చెప్పాడని, అయితే కల్తీ మద్యం తయారుచేసి మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడని మండిపడ్డారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక యువతను గంజాయి మత్తులో ముంచుతున్నాడని ఆరోపించారు.జగన్‌ సర్కారు మరోసారి విద్యుత్‌ బిల్లులు పెంచే యోచనలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి గడపలో ఓ నిరుద్యోగి వున్నాడని, ఆ సమస్య పోవాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరముందని అన్నారు. సంక్షేమ పథకాల కోసం మొబైల్‌ ఫోన్‌ నుంచే దరఖాస్తు చేసుకుని, ఎలాంటి పైరవీలకు తావులేకుండా పొందే విధానాన్ని తెస్తామని ప్రకటించారు. డీకేటీ భూములను రెగ్యులర్‌ చేయడానికి అవసరమైన చట్టం ప్రస్తుతం కర్ణాటకలో అమల్లో ఉందన్నారు. దాన్ని అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే మ్యానిఫెస్టో ద్వారా శుభవార్త అందిస్తామన్నారు.

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

బీసీలకు టీడీపీ పుట్టినిల్లని లోకేశ్‌ అభివర్ణించారు. రజకులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజకులను ఎస్సీల్లో చేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ నివేదిక ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రజక సామాజికవర్గానికి చెందిన దువ్వారపు రామారావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామన్నారు. జగన్‌ ప్రభుత్వంలో రజకులపై వేధింపులు పెరిగాయని, ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక చట్టం కావాలని రజక సోదరులు అడిగారని, మొత్తంగా బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తామని అన్నారు.

కొనసాగిన సెల్ఫీ చాలెంజ్‌..

టీడీపీ ప్రభుత్వం తెచ్చిన కంపెనీలు, పరిశ్రమలూ ఇవి… జగన్‌ ఏమి తెచ్చారో చెప్పగలరా..? పాదయాత్ర లో లోకేశ్‌ తరచూ సీఎం జగన్‌కు విసురుతున్న సవా ల్‌ ఇది. ఈ క్రమంలో 30వ రోజు పాదయాత్ర సందర్భంగా మంగళవారం కూడా ఓ సెల్ఫీతో జగన్‌కు లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ఐతేపల్లి వద్ద కాండోర్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు ఎదుట ఆగి సెల్ఫీ దిగిన లోకేశ్‌.. ఈ విద్యాసంస్థ కాండోర్‌ టీడీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటైందని, ఆ సంస్థకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం 8 ఎకరాల భూమిని కేటాయించిందని గుర్తుచేశారు.

రాష్ట్రాన్ని తాలిబన్‌ రాజ్యంగా మారుస్తావా జగన్‌రెడ్డీ..!

ఈ రోజు మామండూరు క్యాంప్‌ నుంచి 30వ రోజు పాదయాత్ర ప్రారంభించాను. దానికి ముందు శ్రీకాళహస్తికి చెందిన రజక మహిళ మునిరాజమ్మ నన్ను కలసి వైసీపీ ముష్కరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈనెల 17న శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్‌ వద్ద పాదయాత్ర చేస్తున్న సమయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె నాకు చెప్పడమే రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమైంది. ఆమె బతుకుదెరువు కోసం పెట్టుకున్న టిఫిన్‌ సెంటర్‌ను వైసీపీ సైకోలు ధ్వంసం చేశారు. వైసీపీ నేతలు అవమానించిన తీరును మునిరాజమ్మ చెబుతూ..నడివీధిలో చీర విప్పుతామని బెదిరించారని వాపోయింది. అసలు వీళ్లు మనుషులా లేక రాక్షసులా? ఇలాంటి ఘటనలు అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్‌ ప్రభుత్వంలో కనిపిస్తుంటాయి. రాబోయేది నూటికి నూరు శాతం టీడీపీ ప్రభుత్వమే!

15.8 కిలోమీటర్ల నడక

మంగళవారం ఉదయం చంద్రగిరి మండలం మామండూరు నుంచి మొదలైన లోకేశ్‌ యువగళం పాదయాత్ర సాయంత్రం 6.20 గంటలకు పాకాల మండలం గాదంకి టోల్‌గేట్‌ వద్ద ముగిసింది. 30వ రోజు 15.8 కిలోమీటర్ల నడక సాగించారు. దీంతో ఇప్పటి వరకు ఆయన నడిచిన దూరం 397.3 కిలోమీటర్లకు చేరుకుంది. బుధవారం ఉదయం విడిది కేంద్రం నుంచి 2.7 కిలోమీటర్ల దూరం నడిస్తే 400 కి.మీ. పూర్తవుతుంది. పాదయాత్రలో లోకేశ్‌ వెంట మాజీ మంత్రి అమరనాధరెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, యువగళం మీడియా కోఆర్డినేటర్‌ బీవీ వెంకట్రాముడు పాల్గొన్నారు.

Exit mobile version