అనంతపురం జిల్లా అంటే టీడీపీ కంచుకోట..ఆ జిల్లాలో టీడీపీకి బాగా పట్టు ఉంటుందని అంటారు. కానీ ఇప్పటికీ ఆ జిల్లాలో కొన్ని స్థానాల్లో టీడీపీకి పెద్ద బలం లేదు. అలా బలం లేని నియోజకవర్గల్లో మడకశిర కూడా ఒకటి. ఈ స్థానంలో టీడీపీకి గొప్ప విజయాలు ఏమి దక్కలేదు. అయితే 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న తప్పుడు ఆఫడవిట్ ఇచ్చి గెలిచారని, చెప్పి కోర్టు ఆయన్ని అనర్హుడుగా వేటు వేసింది. దీంతో వైసీపీ నేత తిప్పేస్వామి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక 2019 ఎన్నికల్లో కూడా ఈరన్నపై తిప్పేస్వామి మంచి మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ మూడున్నర ఏళ్లలో మడకశిరకు తిప్పేస్వామి ప్రత్యేకంగా చేసిందేమి లేదు. పైగా ఆయనపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తుంది. ఆయన అక్రమాలు, అవినీతికి అంతు లేదని సొంత పార్టీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. తాజాగా మడకశిరకు సంబంధించిన నేతలతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ అయ్యారు..ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ నేతలు నినాదాలు చేశారు.

అవినీతి చక్రవర్తి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్దిరెడ్డి సమక్షంలోనే నినాదాలు చేశారు. దీంతో పెద్దిరెడ్డి వారించి.అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అయినా సరే ఎమ్మెల్యేకు సొంత పార్టీ వాళ్ళు సహకరించేలా లేరు. ఆయనకు మళ్ళీ సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్ళే ఓడించేలా ఉన్నారు.

అయితే వైసీపీలో ఇంత వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని వాడుకుని బలపడటంలో టీడీపీ విఫలమవుతుంది. టీడీపీలో కూడా వర్గ పోరు నడుస్తోంది మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలకు పడటం లేదు. ఇరువురు సీటు కోసం పోటీ పడుతున్నారు. దీంతో మడకశిర టీడీపీలో కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకత ఉన్నా సరే టీడీపీకి పాజిటివ్ లేదు.
