తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద పండుగ మహానాడు..ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా టిడిపి శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాయి. అయితే టిడిపి అధికారం కోల్పోయాక కరోనా వల్ల మహానాడు నిర్వహించడం కుదరలేదు. ఇక గత ఏడాది మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు. ఊహించని విధంగా మహానాడు కార్యక్రమం విజయవంతమైంది. అప్పటికే కసి మీద ఉన్న పసుపు సైనికులు పెద్ద ఎత్తున ఒంగోలుకు వచ్చారు.
అసలు అక్కడ నుంచే టిడిపికి కొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలో మళ్ళీ పార్టీ పికప్ అయింది. అలాంటి పసుపు పండుగని ఈ ఏడాది రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇక ఎన్నికల ముందు జరగనున్న ఈ మహానాడుతో..అధికారమే లక్ష్యంగా టిడిపి ముందు అడుగులు వేయనుంది. అదే సమయంలో రాజమండ్రి పరిధిలో టిడిపికి బలం మరింత పెరిగింది. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో టిడిపికి మొదట నుంచి బలం ఉంది..కాకపోతే గత ఎన్నికల్లోనే టిడిపికి ఎదురుదెబ్బ తగిలింది.

పార్లమెంట్ పరిధిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రీ సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలాపురం సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లు టిడిపి గెలుచుకుంది. మిగిలిన ఐదు సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు అక్కడ వైసీపీపై వ్యతిరేకత మొదలైంది. ఈ క్రమంలో టిడిపి బలపడుతుంది. ఎలాగో సిటీ, రూరల్ స్థానాల్లో టిడిపి బలంగా ఉంది. అయితే రూరల్ సీటులో జనసేన ప్రభావం ఉంది. అక్కడ పొత్తు ఉంటే టిడిపి గెలుపు సులువు. ఇక నిడదవోలు, కొవ్వూరు సీట్లలో టిడిపి ఆధిక్యం ఉంది.
రాజానగరంలో వైసీపీకి పోటీగా టిడిపి ఉంది..కానీ ఇక్కడ జనసేన ఓట్ల ప్రభావం ఉంటుంది. టిడిపితో పొత్తు ఉంటే ఇక్కడ గెలవడం సులువే. అటు అనపర్తిలో వైసీపీకి ఎడ్జ్ ఉంది కానీ..ఎన్నికల ముందు సీన్ మారవచ్చు. గోపాలపురంలో పోటాపోటి ఉంది. అయితే మహానాడు ప్రభావంతో రాజమండ్రీ పార్లమెంట్ లో టిడిపి బలం మరింత పెరగవచ్చు.