రాష్ట్రంలో కొన్నాళ్లుగా.. ప్రభుత్వం తరఫున పనులు చేసే కాంట్రాక్టర్ల పరిస్థితి తీవ్ర అగమ్యగోచరంగా మారి పోయింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి.. బిల్లులు రాని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో రెండేళ్ల కిందట చేసిన పనులకు కూడా ప్రస్తుతం డబ్బులు రాలేదని.. దీంతో తాము అప్పట్లో అప్పులు చేసి.. చేసిన పనులకు ఇప్పటికీ వడ్డీలు కట్టలేక పోతున్నామంటూ.. కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు న్యాయపోరాటానికి దిగుతున్నారు. మరికొందరు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇంకొందరు.. బిల్లులు ఇవ్వండి మహాప్రభో! అంటూ.. రోడ్డెక్కుతున్నారు. ఇక, ఒకరిద్దరు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేక.. దిగులుతో మంచాన పడి.. ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యువ కాంట్రాక్టర్ ఓర్సు ప్రకాష్ మృతి చెందారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయడంలో సబ్ లీజులు తీసుకునే ఓర్సు ప్రకాష్.. రెండేళ్లయినా.. బిల్లులు రాకపోవడంతో.. మానసిక వేదనకు గురై.. మృతి చెందడం .. తీవ్ర ఆవేదనగా మారింది.

విషయంలోకి వెళ్తే.. ఓర్సు ప్రకాష్.. గుంటూరు జిల్లాలో సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేయించాడు. దీనికి సంబంధించి కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఇప్పటికీ కోటి 20 లక్షల పైగా సొమ్మును ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే.. రెండేళ్లు గడిచినా.. ఈ సొమ్మును ప్రభుత్వం రీయింబర్స్ చేయలేదు. దీంతో మానసికంగా దిగులు పెట్టుకుని మంచం పట్టారు. నెల రోజులకు పైగా గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు.

కాగా, తమ కొడుకు చికిత్సకి ఐదు లక్షలకు పైగా ఖర్చు చేశామని మృతుని తల్లిదండ్రులు చిన్న వెంకటేశ్వర్లు, బాల కొండమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమ బిల్లులు ఇవ్వకపోవడం తోనే తన భర్త అకాల మృతి చెందాడని మృతుని భార్య రాణి. మామ నారాయణ ఆరోపించారు. అంతేకాదు.. నాలుగు ఎకరాల పొలం, మూడు చోట్ల స్థలాలు అమ్మినా ఇంకా బాకీలు ఉన్నాయని కన్నీళ్లు భార్య కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతo ఉంటున్న ఇల్లు కూడా వదిలి వెళ్లాలని రుణదాతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్ల పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతుందని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post