మండలి రద్దు అంశం..జగన్ మాట తప్పుతున్న అంశాల్లో ఇదొకటి. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటంతో…తాను చేస్తున్న ప్రతి పనికి అడ్డం వస్తున్నారని చెప్పి జగన్…మండలి రద్దుని ప్రతిపాదించారు. మండలిలో అందరూ రాజకీయ నిరుద్యోగులే ఉన్నారని, మండలి వల్ల ప్రజాధనం వృధా అని చెప్పి జగన్…అసెంబ్లీలో మండలి రద్దు ప్రతిపాదన తీసుకురావడం..వెంటనే దానికి ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపడం జరిగిపోయాయి.

పైగా విలువలు పాటిస్తూ…ఎమ్మెల్సీ ద్వారా మంత్రులైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ల చేత రాజీనామా చేయించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది…కానీ మండలి రద్దు ఇప్పటివరకు ఏమైందో తెలియదు…కేంద్రాన్ని రద్దు చేయమని డిమాండ్ చేయడం లేదు. పైగా వైసీపీలో రాజకీయ నిరుద్యోగులకు మండలిలో చోటు కల్పిస్తున్నారని విమర్శలు తెచ్చుకుంటున్నారు. దీని వల్ల ప్రజాధనం వృధా అవ్వదని జగన్ అనుకోవడం లేదు. అందుకే వరుసపెట్టి ఎమ్మెల్సీ పదవుల భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే మండలిలో వైసీపీకి మెజారిటీ పెరిగింది.

58 సభ్యులున్న మండలిలో ప్రస్తుతం వైసీపీకి 18, టీడీపీకి 17 మంది సభ్యుల బలం ఉంది. ఇక పీడీఎఫ్ సభ్యులు 4, స్వతంత్రులు 4, బీజేపీకి ఒకరు ఉన్నారు. అంటే మొత్తం 44 మంది ఉన్నారు. ఇక ఖాళీలు 14 ఉన్నాయి. ఇప్పుడు ఆ 14 సభ్యులని కూడా జగన్ భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్యేల కోటా నుంచి ముగ్గురుని, స్థానిక సంస్థల కోటా నుంచి 11 మంది ఎమ్మెల్సీలని జగన్ భర్తీ చేయనున్నారు.

అంటే వైసీపీకి 14 మంది సభ్యులు పెరుగుతారు…దీంతో వైసీపీ బలం 32కు చేరనుంది. దీని బట్టి చూస్తే మండలిలో వైసీపీదే ఆధిక్యం. ఇక అసెంబ్లీలో ఏ బిల్లు వచ్చినా సరే మండలిలో ఆమోదముద్ర పడిపోతుంది. ఆఖరికి మూడు రాజధానుల అంశంపై కూడా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మండలి రద్దు అంశంలో జగన్ మాట తప్పేసి ముందుకెళుతున్నారని క్లియర్‌గా అర్ధమవుతుంది.

Discussion about this post