April 2, 2023
ap news latest AP Politics

మాచర్లలో హోరాహోరీ..పిన్నెల్లికి టెన్షన్ మొదలైందా?

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ మాత్రమే గుర్తొస్తుందనే చెప్పాలి. రాజకీయ కక్షలకు అడ్డాగా మారిన మాచర్ల రాజకీయం గత కొన్నేళ్లుగా పిన్నెల్లికే అనుకూలంగా ఉంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో మాచర్లలో టి‌డి‌పి గెలిచింది. మళ్ళీ టి‌డి‌పి అక్కడ గెలవలేదు. 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు.

మధ్యలో వైఎస్సార్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో..పిన్నెల్లి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..మాచర్లలో టి‌డి‌పిని అణిచివేసే కార్యక్రమాలు ఎలా జరిగాయో చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి స్థానిక ఎన్నికలు గాని, మున్సిపల్ ఎన్నికల్లో గాని నామినేషన్లు వేయనివ్వని పరిస్తితి. అన్నిటిని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఇలా మాచర్లలో వైసీపీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరుణంలో టి‌డి‌పి ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మానందరెడ్డి వచ్చాక కాస్త టి‌డి‌పి యాక్టివ్ అయింది. ఆయన దూకుడుగా పనిచేయడంతో సీన్ మారుతూ వస్తుంది. ఎన్ని దాడులు జరిగిన జూలకంటి వెనక్కి తగ్గడం లేదు. ఆయన టి‌డి‌పికి కొత్త ఊపు తీసుకొచ్చారనే చెప్పాలి.

అయితే మాచర్లలో ఎవరెన్ని చేసిన గెలుపు మాత్రం తనదే అని పిన్నెల్లి అంటున్నారు. ప్రజలు తనవైపే ఉంటారని చెబుతున్నారు. ఈ సారి ఆ పరిస్తితి రాదని పిన్నెల్లిని ఓడించి తీరుతామని టి‌డి‌పి శ్రేణులు సవాల్ చేస్తున్నాయి. కానీ గతంలో మాదిరిగా ఈ సారి మాచర్లలో పిన్నెల్లి గెలవడం ఈజీ కాదు. టి‌డి‌పి నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సిందే. ఏదేమైనా ఈ సారి మాచర్లలో హోరాహోరీ పోరు జరగడం ఖాయమనే చెప్పాలి.