మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తుపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే అని చెప్పాలి. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా పవన్ ప్రకటనతో పొత్తుపై ఇంకా క్లారిటీ వచ్చింది. వైసీపీ ఏదైతే కోరుకుంటుందో అది జరగదని అన్నారు..అంటే టిడిపి-జనసేన పొత్తు ఉండకూడదని వైసీపీ భావిస్తుంది. కానీ పొత్తు ఉంటుందని పరోక్షంగా పవన్ సంకేతాలు ఇచ్చేశారు.

ఇక పొత్తు ఉంటే జనసేన కోసం టిడిపి కొన్ని సీట్లు త్యాగాలు చేయాలి. ఇదే క్రమంలో తెనాలి సీటు త్యాగం చేయడానికి టిడిపి రెడీగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజా..తెనాలిలో పోటీ చేయాలా వద్దా? అనేది చంద్రబాబు ఇష్టమని, ఆయన ఏది చెబితే అది చేస్తానని, తన రాజకీయ భవిష్యత్ చంద్రబాబు చూసుకుంటారని చెప్పారు. అంటే జనసేన కోసం తెనాలి సీటు వదులుకోవడానికి రాజా ఫిక్స్ అయ్యారు. ఇక ఇక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి 30 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. అప్పుడు టిడిపిపై వైసీపీ 17 వేల ఓట్ల తేడాతో గెలిచింది.

అంటే టిడిపి-జనసేన కలిసి ఉంటే వైసీపీ గెలిచేది కాదు. ఇటీవల సర్వేల్లో కూడా పొత్తు లేకపోతే ఇక్కడ వైసీపీ గెలవడం ఖాయమని తేలింది. కానీ పొత్తు ఖరారు అవుతున్న నేపథ్యంలో తెనాలిలో వైసీపీ గెలవడం కష్టమని చెప్పాలి. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకే దక్కేలా ఉంది. ఇక టిడిపి నేత రాజాకు వేరే సీటు ఇస్తారా? లేక ఏదైనా పదవి ఇవ్వాలని అనుకుంటున్నారా? అనేది క్లారిటీ లేదు.